కొడుకు ఉద్యోగం కావాలన్నాడు.. తండ్రి పరీక్ష పేపర్ కొన్నాడు
మహబూబ్ నగర్ కు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్ ను తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జనార్దన్ కోసం ఆయన తండ్రి మైబయ్య, ఏఈ పరీక్ష పత్రాన్ని 2 లక్షలు చెల్లించి కొన్నాడు.
కొడుకుని తనకంటే పెద్ద ఉద్యోగంలో చూడాలనుకున్నాడు ఆ తండ్రి. దానికి తగ్గట్టే ఉన్నత చదువులు చదివించాడు. కానీ ఉద్యోగం విషయంలోనే కక్కుర్తి పడ్డాడు. కొడుకు కోసం TSPSC నిర్వహించే అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్ ని 2 లక్షల రూపాయలు చెల్లించి కొన్నాడు. చివరకు పోలీసులకు చిక్కాడు, తనతోపాటు తన కొడుకు అరెస్ట్ కి కూడా కారణమయ్యాడు. TSPSC పేపర్ లీకేజీ కేసులో తాజాగా తండ్రీ కొడుకుల్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్ నగర్ కు చెందిన మైబయ్య, ఆయన కుమారుడు జనార్దన్ ను తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. జనార్దన్ కోసం ఆయన తండ్రి మైబయ్య, ఏఈ పరీక్ష పత్రాన్ని 2 లక్షలు చెల్లించి డాక్యానాయక్ దగ్గర కొన్నాడు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో మైబయ్య టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో డాక్యా నాయక్ తో పరిచయం ఏర్పడింది. ఏఈ పరీక్ష పేపర్ లీక్ అయిందని, 6లక్షలు ఇస్తే ఆ పేపర్ ఇస్తానని డాక్యానాయక్, మైబయ్యకు ఆఫర్ ఇచ్చాడు. అంత ఇచ్చుకోలేనని 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు మైబయ్య. డాక్యా నాయక్ అకౌంట్ కు 2లక్షలు ట్రాన్స్ ఫర్ చేసి పేపర్ తీసుకున్నాడు. కొడుకు జనార్దన్ కి ఇచ్చాడు.
ఎలా దొరికారంటే..?
TSPSC స్టాఫ్ దగ్గర ఏఈ పరీక్ష పత్రం కొనుగోలు చేసిన ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డాక్యానాయక్ ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వారితోపాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వారి ఫోన్ కాల్స్ డేటా సేకరిస్తున్నారు. వారి అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాక్యా నాయక్ అకౌంట్ కి మైబయ్య ట్రాన్స్ ఫర్ చేసిన 2 లక్షల రూపాయలకు లెక్క తేలలేదు. దీంతో డాక్యా నాయక్ ని లోతుగా ప్రశ్నిస్తే మైబయ్య కొడుకు జనార్దన్ కోసం ఏఈ పరీక్ష పేపర్ ని అమ్మినట్టు ఒప్పుకున్నాడు. ఈ సమాచారంతో తండ్రి మైబయ్య కొడుకు జనార్దన్ ను సిట్ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 19కి చేరింది.