పాపం పసిప్రాణాలు.. టీచర్ దెబ్బకు ఒకరు, కరెంట్ షాక్ తో మరొకరు

ఈ రెండు ఘటనలు ఒకేరోజు తెలంగాణలో జరిగాయి. బుడి బుడి అడుగులతో, ముద్దు ముద్దు మాటలతో తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచిన ఆ ఇద్దరు చిన్నారులు ఐదేళ్లు రాకుండానే ప్రాణాలు వదిలారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు.

Advertisement
Update:2023-10-02 18:51 IST

టీచర్ కర్కశత్వం ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది.

సూపర్ మార్కెట్ యాజమాన్యం నిర్లక్ష్యం మరో చిన్నారి జీవితాన్ని చిదిమేసింది.

ఈ రెండు ఘటనలు ఒకేరోజు తెలంగాణలో జరిగాయి. బుడి బుడి అడుగులతో, ముద్దు ముద్దు మాటలతో తల్లిదండ్రులకు సంతోషాన్ని పంచిన ఆ ఇద్దరు చిన్నారులు ఐదేళ్లు రాకుండానే ప్రాణాలు వదిలారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు.

హైదరాబాద్‌ రామంతాపూర్‌ పరిధిలోని వివేక్‌ నగర్‌ లో జరిగిన ఘటన కలకలం రేపింది. రోజూ లాగే శనివారం కూడా స్కూల్ కి వెళ్లాడు యూకేజీ విద్యార్థి హేమంత్. హోమ్ వర్క్ చేయలేదని టీచర్ కొట్టాడు. పలకతో తలపై కాస్త గట్టిగానే కొట్టాడు. తలలో అది తగలరాని చోట తగిలింది. ఇంకేముంది ఆ దెబ్బకు ఒక్కసారిగా స్పృహ తప్పాడు హేమంత్. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులపాటు మృత్యువుతో పోరాడిన హేమంత్ ఈరోజు మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తమ పిల్లవాడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. తమ పిల్లవాడిని కొట్టిన టీచర్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సూపర్ మార్కెట్ లో కరెంటు షాక్..

మరో ఘటనలో సూపర్ మార్కెట్ కి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి కరెంట్ షాక్ తో మృతి చెందడం సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌ లో ఈ ఘటన జరిగింది. నవీపేటకు చెందిన రాజశేఖర్ తన కుమార్తె రుషితను తీసుకుని దగ్గర్లో ఉన్న సూపర్ మార్కెట్ N మార్ట్ కి వెళ్లాడు. రుషిత చాక్లెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ పై చేయి వేసింది. అంతే కరెంట్ షాక్ తో ఆ డోర్ కే వేలాడుతూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత ఫ్రిడ్జ్ కి వేలాడుతున్న పాపను చూసి రాజశేఖర్ భయపడ్డాడు. వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి పరుగులు తీశాడు. అప్పటికే ఆ పాప మృతి చెందినట్టు తేల్చారు వైద్యులు. చిన్నారి మృతదేహంతో సూపర్‌ మార్కెట్‌ ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

Tags:    
Advertisement

Similar News