హెచ్‌వోడీల కార్యాలయాల కోసం ట్విన్ టవర్స్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలు, వారి ఆధ్వర్యంలో పని చేస్తున్న సిబ్బంది కోసం ఇంటిగ్రేటెడ్ ట్విన్ టవర్స్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధిపతుల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ - హెచ్‌వోడీ) కార్యాలయాల కోసం నూతన సచివాలయం సమీపంలోనే ఇంటిగ్రేటెడ్ ట్విన్ టవర్స్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయా శాఖల అధిపతులు సమీక్ష సమావేశాలకు, ఇతర పనుల కోసం తరచూ సచివాలయానికి రావల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో వివిధ శాఖ హెచ్‌వోడీ కార్యాలయాలు ఉన్నాయి. ట్రాఫిక్ కారణంగా వారికి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. అందుకే అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలు, వారి ఆధ్వర్యంలో పని చేస్తున్న సిబ్బంది కోసం ఇంటిగ్రేటెడ్ ట్విన్ టవర్స్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
సోమవారం సచివాలయానికి వచ్చి దశాబ్ది ఉత్సవాల సన్నాహాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. అనంతరం సెక్రటేరియట్ సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీశారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు.. హెచ్ఓడీలన్నీ ఒకే చోట వుండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్ఓడీలు వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తి స్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
అమరుల స్మారకం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం..
సెక్రటేరియట్ సమీపంలో నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మారకం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిర్మాణ పనులను గమనిస్తూ స్మారకం వద్ద కలియతిరిగారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి చివరి దశ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు.
అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్ అండ్ బి ఇంజనీర్ శశిధర్‌ను సీఎం ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా వుండే విధంగా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. అనంతరం బిఆర్కేఆర్ భవన్ వద్ద నిర్మించిన వంతెనల నిర్మాణాన్ని సీఎం పరిశీలించారు.
దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష, సబ్ కమిటీ విధివిధానాలపై ఆరా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జూన్ రెండు నుంచి రోజు వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీఎంకు వివరించారు. రాష్ట్రంలో కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయి బ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. వీరికి రూ.1 లక్ష చొప్పున దశల వారీగా ఆర్థిక సాయం అందిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి విధి విధానాలను మరో రెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ ఛైర్మన్, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎంకు వివరించారు. త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ మంత్రి గంగులను ఆదేశించారు.