పువ్వాడపై పోటీకి సిద్ధంగా లేని తుమ్మల! ఉమ్మడి ఖమ్మంలో ఆ మూడు సీట్లపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడింటిలో ఎక్కడ ఇచ్చినా నిలబడతానని చెప్తున్నారు. కానీ ఆయన పాలేరు లేదా కొత్తగూడెం టికెట్ల పైనే ఎక్కువ ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2023-09-16 11:51 IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్టీ బలంగా ఉన్నదని భావిస్తున్న నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను అడ్జెస్ట్ చేసేందుకు ముప్పతిప్పలు పడుతోంది. కాంగ్రెస్ బలం పెంచేలా ఇతర పార్టీల నుంచి కీలక నాయకుల చేరికలు జరిగినా.. వారికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలనే విషయంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రారంభమైన టికెట్ల రగడ.. ఇప్పుడు తుమ్మల రావడంతో తారా స్థాయికి చేరినట్లు తెలుస్తున్నది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడింటిలో ఎక్కడ ఇచ్చినా నిలబడతానని చెప్తున్నారు. కానీ ఆయన పాలేరు లేదా కొత్తగూడెం టికెట్ల పైనే ఎక్కువ ఆశ పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ఖమ్మం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ మరో సారి టికెట్ కేటాయించారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న పువ్వాడకు కమ్మ సామాజిక వర్గం సపోర్ట్ కూడా ఉంది. దీంతో కమ్మ సామాజిక వర్గం ఓట్లు గంప గుత్తగా పడకూడదు అంటే తుమ్మలను ఖమ్మం నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అదే విషయం తుమ్మలతో చర్చించినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్, ఖమ్మంలో బలమైన నాయకుడిగా ఉన్న పువ్వాడపై పోటీ చేయడానికి తుమ్మల నాగేశ్వరరావు ఇష్టపడటం లేదనే ప్రచారం జరుగుతోంది. తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన పాలేరు నుంచి పోటీ చేయడానికే తుమ్మల మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. తనను ఓడించిన కందాల ఉపేందర్ రెడ్డిపైనే పోటీకి దిగుతానని.. తన అనుచరులు అందరూ అదే కోరుకుంటున్నారని తుమ్మల వివరించినట్లు తెలుస్తున్నది.

తుమ్మల పాలేరు నుంచి పోటీ చేస్తే.. పొంగులేటి ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మువ్వా విజయ్‌బాబు ఇప్పటికే కొత్తగూడెంలో ప్రచారం చేసుకుంటున్నారు. గడప గడపకు మువ్వా అంటూ నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. దీంతో పొంగులేటికి ఖమ్మం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఖమ్మంలో పువ్వాడపై పోటీ చేస్తే కమ్మ, ముస్లిం, మైనార్టీ వర్గాలు తనకు ఓటు వేస్తాయా లేదా అనే డైలమాలో పొంగులేటి ఉన్నారు. ఇప్పటికే ఆయా వర్గాల్లో పువ్వాడకు మంచి పట్టు ఉన్నది. పైగా వామపక్ష పార్టీలు ఎవరికి మద్దతు ఇచ్చినా.. ఖమ్మంలో పువ్వాడ వెంటే ఉంటారనే టాక్ నడుస్తోంది. ఈ కారణాల వల్లే పొంగులేటి ఖమ్మం నుంచి పోటీ చేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు, తుక్కుగూడ బహిరంగ సభ, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తర్వాత తెలంగాణ టికెట్ల విషయంలో కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. అప్పుడే ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు టికెట్ల విషయంలో కచ్చితమైన నిర్ణయం వెలువడనున్నది. ఈ లోగా మరోసారి సునిల్ కనుగోలు టీమ్ సర్వే చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    
Advertisement

Similar News