తెలంగాణలో శ్రీవారి ఆలయం.. ఘనంగా శంకుస్థాపన మహోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగినట్టే పూజలు, నిత్య కైంకర్యాలు ఇక్కడ కూడా నిర్వహిస్తారని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ తరపున అర్చకులు, సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇక్కడే పోటు నిర్మించి ప్రసాదాలు తయారు చేయిస్తామన్నారు.

Advertisement
Update:2023-05-31 15:52 IST

తిరుమల శ్రీవారు కరీంనగర్ కు తరలి వస్తున్నారు. కరీంనగర్ లో టీటీడీ ఆలయానికి ఈరోజు శంకుస్థాపన జరిగింది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆలయ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. ఆలయ శంకుస్థాపన సందర్భంగా టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు నిర్వహించారు.

10 ఎకరాల ప్రాంగణంలో..

దాదాపు 10ఎకరాల ప్రాంగణంలో కరీంనగర్ లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎలా ఉంటుందో.. ఇక్కడ కూడా అదే రీతిలో విగ్రహాలు, ఉపాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ లో 10ఎకరాల భూమి కేటాయించగా.. ఏపీ ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో 20కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్‌.

పూజలు, ప్రసాదాలు..

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగినట్టే పూజలు, నిత్య కైంకర్యాలు ఇక్కడ కూడా నిర్వహిస్తారని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ తరపున అర్చకులు, సిబ్బందిని నియమిస్తామన్నారు. ఇక్కడే పోటు నిర్మించి ప్రసాదాలు తయారు చేయిస్తామన్నారు. తిరుమలలో జరిగినట్టే ఇక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూజాధికాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రసాదాల నాణ్యత కూడా తిరుమల లాగే ఉంటుందన్నారు. ఆలయ శంకుస్థాపన సందర్భంగా తెలంగాణ ప్రజలకు వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News