900 కోట్ల మోసం.. టీటీడీ సభ్యత్వానికి రాజీనామా

ప్రపంచస్థాయి వసతులతో నిర్మాణాలు ఉంటాయంటూ కస్టమర్ల నుంచి నిధులు వసూలు చేశారు. భూసేకరణ, ఇతర అనుమతులకు సమయం పడుతోందని త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తామంటూ మూడేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చారు.

Advertisement
Update:2022-12-03 08:52 IST

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు, సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రీలాంచ్ ప్రాజెక్ట్ పేరుతో 2,500 మంది నుంచి 900 కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు లక్ష్మీనారాయణ. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ వద్ద 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది భారీ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నట్టు 2019లో లక్ష్మీనారాయణ ప్రకటించారు.

ప్రపంచస్థాయి వసతులతో నిర్మాణాలు ఉంటాయంటూ కస్టమర్ల నుంచి నిధులు వసూలు చేశారు. భూసేకరణ, ఇతర అనుమతులకు సమయం పడుతోందని త్వరలోనే నిర్మాణాలు ప్రారంభిస్తామంటూ మూడేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు చేతులెత్తేశారు. కొందరికి ఇచ్చిన చెక్‌లు కూడా బౌన్స్ అయ్యాయి. దాంతో బాధితులంతా ఒక సంఘంగా ఏర్పడి పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు పీఎస్‌లలో కేసులు నమోదు అయ్యాయి. 900 కోట్ల రూపాయల భారీ మోసం కావడంతో సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగారు.

వందల కోట్లు వసూలు చేసిన లక్ష్మీనారాయణ ఏపీ అమరావతిలోనూ భూములు కొన్నట్టు గుర్తించారు. లక్ష్మీనారాయణ బాధితుల జాబితాలో ఎన్‌ఆర్‌ఐలు, ఐటీ ఉద్యోగులు, కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయడంతో టీటీడీ సభ్యత్వానికి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. 2021 సెప్టెంబర్‌లో టీటీడీ సభ్యుడిగా ఈయన ప్రమాణస్వీకారం చేశారు. విశాఖ శారదా పీఠాధిపతికి ఈయన భక్తుడు. పీఠాధిపతి ఆశీస్సులతోనే ఈయనకు టీటీడీ సభ్యత్వం లభించిందన్న ప్రచారం ఉంది.

Tags:    
Advertisement

Similar News