టీఎస్ఆర్టీసీ ఆధునీకరణకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా నష్టాల నుంచి గట్టెక్కించడానికి పార్శిల్ సర్వీసులు, టీటీడీ టికెట్ ఆఫర్ల వంటివి తీసుకొని వచ్చారు. అయితే ఇటీవల డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. డీజిల్ సెస్ విధించినా పెద్దగా ప్రయోజనం దక్కడం లేదు. చమురు మార్కెటింగ్ సంస్థల నుంచి బల్క్‌లో డీజిల్ కొనడంతో భారంగా మారింది. దీంతో బయట బంకుల్లో ఆయిల్ కొనడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇక సంస్థకు మరింత భారం తగ్గించేలా ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే కావడంతో టీఎస్ఆర్టీసీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను ఎయిర్‌పోర్ట్ రూట్లో తిప్పుతోంది. అవి విజయవంతం కావడంతో మరో 300 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్డర్ పెట్టింది. మేఘా గ్రూప్‌కు చెందిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా టీఎస్ఆర్టీసీ కోసం బస్సుల ఆర్డర్ అందుకున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తెలిపింది. కేంద్రం ప్రకటించిన ఫేమ్ 2 పథకం ద్వారా ఈ రూ. 500 కోట్ల విలువైన 300 బస్సులను మేఘా కంపెనీ అందించనున్నది.
12 ఏళ్ల కాలపరిమితికి ఆర్డర్ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్దతిలో ఈ బస్సులను టీఎస్ఆర్టీసీ తీసుకోనున్నది. అంటే ఈ బస్సులను టీఎస్ఆర్టీసీకి అప్పగించిన తర్వాత కూడా పూర్తి నిర్వహణను ఒలెక్ట్రా కంపెనీనే చూసుకుంటుంది. ఇప్పటికే మూడేళ్ల నుంచి హైదరాబాద్ రోడ్లపై ఒలెక్ట్రా బస్సులు విజయవంతంగా నడిపిస్తున్నామని సంస్థ చైర్మన్ కేవీ ప్రదీప్ తెలిపారు. కొత్తగా మరో ఆర్డర్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు.
కాగా, ఈ ఒలెక్ట్రా బస్సులు ఒకసారి చార్జ్ చేస్తే కనీసం 300 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి. సిటీలోనే కాకుండా దగ్గర ఉండే పట్టణాలకు ఈ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఎలాంటి వాయు, శబ్ద కాలుష్యం లేకుండా నడిచే ఈ బస్సుల వల్ల ఇతర ఇంధన, మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతాయని సంస్థ చెబుతోంది. 20 నెలల్లో 300 బస్సులను ఒలెక్ట్రా సంస్థ.. టీఎస్ఆర్టీసీకి విడతల వారీగా అప్పగించనున్నది.