1000 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్న టీఎస్ఆర్టీసీ.. ఐటీ కారిడార్‌లో విస్తరించనున్న సేవలు

కొత్త 1000 బస్సులతో పాటు.. 1,560 ఎలక్ట్రిక్ బస్సుల్ని అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు.

Advertisement
Update:2023-06-27 07:29 IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) త్వరలో 1000 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నది. రాష్ట్రంలో కాలం చెల్లిన బస్సులను తీసి వేసి.. వాటి స్థానంలో కొత్త బస్సులను నడపనున్నది. ఇప్పటికే ఓ బ్యాంకు రూ.350 కోట్లను మంజూరు చేసింది. కాగా, కొత్త బస్సుల కొనుగోలు కోసం గతంలోనే టెండర్లు పిలిచారు. వాటిని మంగళవారం తెరవనున్నారు. అతి తక్కువ ధర కోట్ చేసిన కంపెనీకి ఈ టెండర్లు దక్కనున్నాయి. టీఎస్ఆర్టీసీ కొనుగోలు చేయనున్న కొత్త బస్సుల్లో 416 ఎక్స్‌ప్రెస్, 300కు పైగా పల్లెవెలుగు సర్వీసులు, మిగిలినవి రాజధానితో పాటు ఏసీ సర్వీసులు ఉన్నట్లు టీఎస్ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

టీఎస్ఆర్టీసీకి కరోనా ముందు మంచి ఆదరణ ఉండేది. ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండటంతో ఆదాయం కూడా ఎక్కువగా వచ్చేది. అప్పట్లో రోజుకు 45 లక్షల నుంచి 50 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. కాగా, కరోనా అనంతరం తిరిగి సేవలు ప్రారంభించినా.. ప్రతీ రోజు ప్రయాణించే వారి సంఖ్య 32 లక్షలు దాటడం లేదు. బస్ పాస్‌లతో ప్రయాణించే 10 లక్షల మందిని కలిపినా.. మునుపటి ఆక్యుపెన్సీ రావడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నట్లు ఆర్టీసీ అధ్యయనంలో తేలింది.

కరోనా సమయంలో పలు రూట్లలో బస్సు సర్వీసులు నిలిపివేశారు. పాత డొక్కు బస్సులను మూలకు పడేయడంతో కొన్ని రూట్లలో సర్వీసులు ఆగిపోయాయి. మరోవైపు ప్రైవేటు వాహనాలు భారీగా పెరగడంతో ఆర్టీసీని ఆశ్రయించే వారు తగ్గిపోతున్నారు. దీంతో కొత్త బస్సులను కొనుగోలు చేసి.. నిలిపివేసిన రూట్లతో పాటు కొత్త రూట్లలో కూడా బస్సులు తిప్పితే తిరిగి ప్రయాణికుల సంఖ్య, ఆదాయం పెంచుకోవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు.

రాబోయే కొత్త 1000 బస్సులతో పాటు.. 1,560 ఎలక్ట్రిక్ బస్సుల్ని అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు. 2023-24కు గాను 957 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. మిగిలిన ఎలక్ట్రిక్ బస్సులు 2025 మార్చి నాటికి వస్తాయని అధికారులు తెలిపారు. త్వరలో 50 ఎలక్ట్రిక్ అద్దె బస్సులు రానుండగా.. వాటిని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడపనున్నారు. ఐటీ కారిడార్‌లో మెట్రో సేవలు పూర్తిగా అందుబాటులో లేవు. నగరంలోని కొన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ కూడా లేదు. దీంతో 30 ఏసీ అద్దె బస్సులను ఐటీ కారిడార్‌కు తిప్పనున్నారు.

నిజాంపేట, బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌కు.. వనస్థలిపురం నుంచి వేవ్‌రాక్ వద్దకు 30 బస్సులు నడపనున్నారు.ఇక 20 బస్సులను ఎయిర్‌పోర్టుకు తిప్పుతారు. జూలై తొలి వారంలో 25 ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ సన్నాహం చేస్తోంది. ఇక హైదరాబాద్‌లో 10 డబుల్ డెక్కర్ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఏ రూట్లో తిప్పాలనే విషయంపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు.

ఆర్టీసీ రిజర్వేషన్ చార్జీల తగ్గింపు..

టీఎస్ఆర్టీసీలో అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ చార్జీలను తగ్గించినట్లు సంస్థ ఎండీ వీసీ. సజ్జనార్ పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 350 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి రూ.20, ఆపై దూరానికి రూ.30 వసూలు చేయనున్నారు. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.30 అడ్వాన్స్ రిజర్వేషన్ చార్జీగా నిర్ణయించారు. ప్రతీ రోజు సగటున 15వేల మంది ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయం పెరుగుతూ.. నష్టాలు తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

సూర్యపేటలో ఈ-గరుడ చార్జింగ్ స్టేషన్..

మియాపూర్ నుంచి విజయవాడకు ఈ-గరుడ బస్ సేవలను ఆర్టీసీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బస్సులకు సూర్యపేటలోని ఒక ప్రైవేట్ చార్జింగ్ స్టేషన్ వద్ద ఇన్నాళ్లూ చార్జింగ్ చేయిస్తున్నారు. అయితే సూర్యపేట బస్టాండ్‌లో కొత్తగా చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీంతో ఇకపై మియాపూర్-విజయవాడ బస్సులు సూర్యపేటలో చార్జింగ్ చేసుకుంటాయని సంస్థ తెలిపింది. ఈ-గరుడ బస్సుకు సూర్యపేటలో స్టాప్ కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నది.

Tags:    
Advertisement

Similar News