బెంగళూరుకు టీఎస్ఆర్టీసీ అధికారులు.. ఉచితానికి ఏర్పాట్లు

ఆరు గ్యారెంటీలపై సీఎం సంతకం పెట్టే సమయానికి నివేదిక సిద్ధం చేయాలని టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
Update:2023-12-06 09:11 IST

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తామన్న ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఒకటి. దీనికోసం తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు గ్యారెంటీలను వెంటనే అమలులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి.. ఈలోపుగా అంచనాలు సిద్దం చేయడానికి అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు.

మహిళలకు ఉచిత ప్రయాణం.. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ఎంత భారం పడుతుందనే విషయంలో తెలంగాణ ఆర్టీసీ అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో ఈ పథకం ఎలా అమలవుతోంది, అక్కడ ఎంత ఖర్చవుతోంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తోందనే విషయాలను పరిశీలించేందుకు అధికారుల బృందం బెంగళూరుకు వెళ్తోంది. రెండు రోజుల పాటు అక్కడ ఈ పథకం అమలుని పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తుంది.

ఆరు గ్యారెంటీలపై సీఎం సంతకం పెట్టే సమయానికి నివేదిక సిద్ధం చేయాలని టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. కర్నాటక తరహాలో పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ప్రతి ఏటా ఆర్టీసీపై రూ.2200 కోట్ల భారం పడుతుంది. పల్లె వెలుగు బస్సులకే ఈ పథకం పరిమితం చేస్తే రూ.750 కోట్లు అవుతుందని అంచనా. ప్రభుత్వాలు ఈ మేరకు ఖర్చుని సర్దుబాటు చేస్తే ఆర్టీసీపై భారం పడకుండా ఉంటుంది. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ పేరుతో ప్రత్యేక టికెట్ ని అందిస్తారా, లేక మహిళలు టికెట్ లేకుండానే ప్రయాణించొచ్చు అనే స్టేట్ మెంట్ ఇస్తారా..? వేచి చూడాలి.

ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు ఇప్పుడు యథాతథంగా అమలు చేస్తారా, లేక దానికి మార్పులు చేర్పులు ఉంటాయా అనేది కూడా తేలాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది.

 

Tags:    
Advertisement

Similar News