టీఎస్ఆర్టీసీ 'గమ్యం'.. మీ ప్రయాణం మరింత సులభం
అత్యాధునిక ఫీచర్లతో సిద్ధం చేసిన 'గమ్యం' యాప్ ని ఎంజీబీఎస్ బస్టాండ్ లో ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారాయన
రైలు ప్రయాణికుల్లో చాలామందికి 'వేర్ ఈజ్ మై ట్రైన్' అనే యాప్ గురించి తెలిసే ఉంటుంది. ఏ ట్రైన్ ఎక్కడుంది? ఏ స్టేషన్ కి ఎంత దూరంలో ఉంది? అనే విషయాన్ని ఆ యాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు బస్సులకు కూడా ఈ సౌకర్యం వచ్చేసింది. తెలంగాణ ఆర్టీసీ ముందుగా ఈ యాప్ ని తెరపైకి తెచ్చింది. దీనిపేరు 'గమ్యం'. ఈ 'గమ్యం' యాప్ ద్వారా ప్రయాణికుల నిరీక్షణ సమయం తగ్గిపోతుందని అంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఏ బస్సు ఎక్కడుందో యాప్ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చని చెప్పారు.
అత్యాధునిక ఫీచర్లతో సిద్ధం చేసిన 'గమ్యం' యాప్ ని ఎంజీబీఎస్ బస్టాండ్ లో ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఆర్టీసీకి చెందిన 4,170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారాయన. హైదరాబాద్ లోని పుష్పక్, మెట్రో సర్వీస్ లకు కూడా ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. జిల్లాల్లోని పల్లె వెలుగు మినహా అన్ని బస్సులు ఈ యాప్ ద్వారా ట్రాకింగ్ లోకి వస్తాయన్నారు. ఈ యాప్ లో కేవలం బస్ ట్రాకింగ్ సదుపాయమే కాకుండా మహిళల భద్రత కోసం కూడా పలు ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డయల్ 100, 108 నెంబర్లకి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేశారు.
ప్రజలకు మరింత చేరువగా..
తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వంలో విలీనం అవుతుండగా.. సంస్థ అభివృద్ధికి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. రూ.200 కోట్లతో బస్టాండ్ లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు సజ్జనార్. సిబ్బంది ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి డిపోలో ఒక హెల్త్ వాలంటీర్ ని నియమిస్తున్నారు. ‘ప్రజల వద్దకు ఆర్టీసీ’ కార్యక్రమంతో ప్రజా రవాణా వ్యవస్థపై మరింత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. బస్సులు ట్రాక్ చేసేందుకు ఇప్పుడు గమ్యం యాప్‌తో ముందుకు వచ్చామని, మ్యాప్ మై ఇండియా సహకారంతో యాప్ ను విజయవంతంగా లాంచ్ చేస్తున్నామన్నారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ గమ్యం యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు సజ్జనార్.