ప్రైవేటుకి ధీటుగా TSRTC, దేశంలోనే మూడో స్థానం
TSRTC ఎలక్ట్రిక్ బస్సుల సమీకరణలో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తాజాగా పక్క రాష్ట్రం ఏపీకి ఈ-గరుడ పేరుతో 10 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రెండేళ్లలో కొత్తగా 1860 బస్సులు అందుబాటులోకి తెస్తారు.
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు, తెలంగాణలో మాత్రం ప్రభుత్వరంగ సంస్థగానే ఆర్టీసి ఉంది. కానీ రెండు రాష్ట్రాల్లో చాలా తేడా ఉంది. ఏపీలో ప్రభుత్వంలో విలీనం చేసినా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ అభివృద్ధి కళ్లకు కట్టింది. ప్రైవేటు వ్యవస్థకు ధీటుగా TSRTC దేశంలోనే మూడో స్థానం సంపాదించింది. ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేయడంలో, నిర్వహణలో, ఆదాయంలో.. అగ్రగామిగా నిలిచింది.
ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో..
ఆర్టీసీని బతికించాలి, ఆర్టీసీ కార్మికులను బతికించాలనే కృతనిశ్చయంతో సీఎం కేసీఆర్ పలు సంస్కరణలు తీసుకొచ్చారు. నిధుల మంజూరులో కూడా ఉదారంగా ఉన్నారు. ప్రతి ఏడాదీ 1500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. దీంతో TSRTC మెరుగైన రవాణా సంస్థగా పేరు తెచ్చుకుంటోంది. ఎలక్ట్రిక్ బస్సుల సమీకరణలో ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. తాజాగా పక్క రాష్ట్రం ఏపీకి ఈ-గరుడ పేరుతో 10 బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రవేశ పెట్టిన తొలి ఎలక్ట్రిక్ బస్సులివి. త్వరలోనే వీటి సంఖ్యను 50కి పెంచుతారు. ప్రతి 20నిమిషాలకు ఓ ఎలక్ట్రిక్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరేలా ప్రణాళిక రూపొందించారు.
ఈ ఏడాది 500 బస్సులు టార్గెట్..
TSRTCలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను ఏడాదికేడాది పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరం మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాలనే ప్రణాళిక సిద్ధం చేశారు. రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తారు. వీటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 560 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని చెబుతున్నారు. రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం అందించండం కోసం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకీ తీసుకొచ్చామని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సు లో ఫ్రీ వైఫై సిస్టం, ట్రాకింగ్ సిస్టం, ప్యానిక్ బటన్ సిస్టం లు అందుబాటులో ఉన్నాయన్నారు.