టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్స్.. సిటీలో ప్రయాణానికి పలు రాయితీ టికెట్లు

ఇకపై టీ-24 టికెట్ ధర రూ.90గా ఉంటుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే రూ.80కే ఇస్తామని చెప్పారు.

Advertisement
Update:2023-04-28 08:57 IST

కొత్త బస్సులు, ఆఫర్లతో టీఎస్ఆర్టీసీ దూసుకొని పోతోంది. ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ బస్సులు, స్లీపర్ బస్సులు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. తెలంగాణలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా బస్సులు తిప్పుతూ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. రాష్ట్రం నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సులకు డైనమిక్ చార్జింగ్ పేరుతో రాయితీలు కూడా అందిస్తోంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వేసవి సెలవుల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి పలు బస్సులు ఎక్కుతుంటారు. అలాగే పలు పనుల నిమిత్తం వచ్చే వాళ్లు కూడా ఉంటారు. వీరి కోసం టీ-24 పేరుతో ఎప్పటి నుంచో ఒక టికెట్ జారీ చేస్తున్నారు. రూ.100 విలువైన ఈ టికెట్ కొని 24 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఇప్పుడు దీనిపై రాయితీ ప్రకటించారు. ఇకపై టీ-24 టికెట్ ధర రూ.90గా ఉంటుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే రూ.80కే ఇస్తామని చెప్పారు.

టీ-6 టికెట్:

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి మహిళలు, వృద్ధుల కోసం టీ-6 టికెట్ తీసుకొని వచ్చారు. రూ.50 విలువైన ఈ టికెట్ కొన్న వారు ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ప్రయాణించడానికి వీలుంటుంది.

ఎఫ్-24 టికెట్ :

కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రయాణించడానికి వీలుగా ఎఫ్-24 టికెట్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. రూ.300 విలువైన ఎఫ్-24 టికెట్ కొంటే.. నలుగురు ప్రయాణికులు 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.

టీఎస్ఆర్టీసీ సిటీ ప్రయాణికుల కోసం తీసుకొని వచ్చిన ఈ టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లు అన్ని బస్సుల్లోని కండక్టర్ల వద్ద లేదా ఆర్టీసీ టికెట్ కౌంటర్లలో లభిస్తాయని చెప్పారు. ఈ టికెట్లు కొని నగరంలో వేసవి సెలవులు ఆనందంగా గడపాలని.. క్షేమంగా, సురక్షితంగా ప్రయాణించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.



Tags:    
Advertisement

Similar News