టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్..! - పెళ్లిళ్ల సీజన్ కావడంతో అద్దె బస్సులపై 10 శాతం రాయితీ
TSRTC Bus rent for Marriage: శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రాయితీ ప్రకటించినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ప్రైవేటు వాహనాల కంటే తక్కువ ధరకే టీఎస్ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తోందని వారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో శుభకార్యాలకు బుక్ చేసుకునే అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీ ప్రకటించింది. అన్ని రకాల బస్సు సర్వీసులపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు ఈ రాయితీ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
శుభకార్యాల సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రాయితీ ప్రకటించినట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ప్రైవేటు వాహనాల కంటే తక్కువ ధరకే టీఎస్ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తోందని వారు తెలిపారు. ముందస్తు నగదు డిపాజిట్ లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
శుభకార్యాలకు, పెళ్లిళ్లకు తమ అద్దె బస్సులను వినియోగించుకుని టీఎస్ఆర్టీసీని ప్రోత్సహించాలని వారు కోరారు. అద్దె బస్సుల కోసం తమ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని వారు కోరారు. ఇప్పడున్నదంతా పెళ్లిళ్ల సీజనే కావడంతో డిమాండ్‌కు అనుగుణంగా అద్దె బస్సులను అందుబాటులో ఉంచాలని వారు అధికారులను ఆదేశించారు.
టీఎస్ఆర్టీసీ సంస్థ గతంలో కార్తీక మాసం, వనభోజనాలు, శబరిమల అయ్యప్ప దర్శనం సందర్భంగా రాయితీలు ప్రకటించింది. ఆ రాయితీల గడువు డిసెంబర్ 31తో ముగిసింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాయితీ ఇస్తే బాగుంటుందని క్షేత్రస్థాయి అధికారులు సూచించిన మేరకు సంస్థ ప్రస్తుత రాయితీని ప్రకటించింది.