TSPSC నుంచి SSC వరకు.. పేపర్ లీకేజీ వెనక కుట్రకోణం

TSPSC లీకేజీ సూత్రధారి రాజశేఖర్, టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీలో పాత్రధారి ప్రశాంత్ కి తెలంగాణ బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని అన్నారు మంత్రి సబిత.

Advertisement
Update:2023-04-05 21:32 IST

తెలంగాణలో ఇటీవల TSPSC పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ల లీకేజీ మరోసారి కలకలం రేపింది. ఈ రెండిటి వెనక కుట్రకోణం ఉందని అంటున్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తాజాగా టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ల లీకేజీ వెనక బీజేపీ హస్తం ఉన్నట్టు బయటపడటం, ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ కావడం.. ఈ కుట్రకి నిదర్శనం అని చెప్పారామె. వికారాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి సబిత.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకే..

రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచనతోనే బీజేపీ నేతలు పేపర్ లీకేజీలకు పాల్పడ్డారని ఆరోపించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుట్ర పన్నారని ఆమె మండిపడ్డారు. స్వార్ధ రాజకీయాల కోసం 5 లక్షల మంది విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లీకేజీ వీరులతో బీజేపీకి సంబంధాలు..

TSPSC లీకేజీ సూత్రధారి రాజశేఖర్, టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీలో పాత్రధారి ప్రశాంత్ కి తెలంగాణ బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని అన్నారు మంత్రి సబిత. వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి పేపర్ లీక్ చేసిన గవర్నమెంట్ టీచర్ కూడా బీజేపీ అనుబంధ సంఘం సభ్యుడని గుర్తు చేశారామె. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకునేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. లీకేజీ కుట్రని ఛేదిస్తామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News