రేణుక దంపతులపై వేటు.. ఉద్యోగాలనుంచి తొలగింపు
రేణుక, వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెను విధులనుంచి తొలగించారు.
TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఓవైపు సిట్ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రేణుక, అదనపు సంపాదన కోసం అడ్డదారులు తొక్కింది. TSPSCలో లూప్ హోల్స్ పసిగట్టి, అక్కడి ఉద్యోగులతో పరిచయం పెంచుకుని ప్రశ్నాపత్రాల లీకేజీకి సూత్రధారిగా మారిందని ఇప్పటికే పోలీస్ విచారణలో తేలింది. దీంతో రేణుకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
రేణుకతో పాటు ఆమె భర్త డాక్యా నాయక్ ను ఉద్యోగాల నుంచి తొలగించారు. రేణుక, వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెను విధులనుంచి తొలగించారు. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రొనాల్డ్ రాస్ కి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్.. రేణుక వ్యవహారంపై నివేదిక పంపారు. ఆ నివేదిక ప్రకారం రేణుకని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రొనాల్డ్ రాస్. రేణుక భర్త డాక్యా నాయక్ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ ఆఫీస్ లో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అధికారులు ఆయనను కూడా సస్పెండ్ చేశారు.
రాజశేఖర్ – ప్రవీణ్ – రేణుక..
ముందు రాజశేఖర్ ప్రశ్నా పత్రాలను పెన్ డ్రైవ్ లో బయటకు తేగా, వాటిని ప్రవీణ్ కి అందించేవాడని, అతను రేణుకకు వాటిని ఇచ్చి నిరుద్యోగులతో బేరం మాట్లాడాలని చెప్పేవాడు. ఇలా ఈ వ్యవహారం గుట్టుచప్పుడుగానే సాగినా.. చివరకు ఓ దావత్ దగ్గర గొడవలొచ్చి అంతా బయటపడింది. ఈ ముఠా పరీక్ష పత్రాలను ఎవరెవరికి అమ్మింది, వారి వద్దనుంచి ఎంత సొమ్ము సేకరించింది, ఆ సొమ్ముని ఏం చేసింది అనే విషయాలపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ జరపుతున్నారు.