ఎన్నికలొస్తున్నాయ్.. త్వరగా పరీక్షలు పెట్టండి సార్!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారిని ఆలోచనలో పడేస్తోంది.

Advertisement
Update:2023-08-10 10:23 IST

త్వరలోనే గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. అలాగే గతంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, హాస్టల్ వెల్ ఫేర్ ఆఫీసర్, గ్రూప్-3 పోస్టులకు కూడా దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌ ప్రక్రియ పూర్తయింది. ఇది జరిగి దాదాపు 6 నెలలు గ‌డుస్తోంది. సుమారు 10 లక్షల మంది దరఖాస్తు కూడా చేసుకున్నారు. కానీ, ఇప్పటివరకూ వీటికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల తేదీలు ఖరారు చేయలేదు.

కారణాలు ఏవైనా సరే.. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష గతంలో ర‌ద్దు అయ్యింది. మరోవైపు హాస్టల్ వెల్ ఫేర్ ఆఫీసర్, గ్రూప్- 3 పోస్టుల నియామకాలకైతే పరీక్షల తేదీల ఊసే ఇప్పటివరకూ లేదు. ఇంకో దిక్కు చూస్తే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. వినిపిస్తున్న వార్తలు నిజమైతే ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారిని ఆలోచనలో పడేస్తోంది. ఎన్నికల వరకూ అధికారులు స్పందించకుంటే.. కనీసం 6 నుంచి 10 నెలల పాటు.. అంటే సుమారు ఏడాది పాటు తాము పరీక్షల కోసం ఎదురుచూడాల్సి వస్తుందన్న ఆందోళన అభ్యర్థుల నుంచి వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈనెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. కమిషన్ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వారు గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ప్రక్రియ పూర్తి చేయడంపైనే కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. వీటికి తోడు త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, హాస్టల్ వెల్ ఫేర్ ఆఫీసర్, గ్రూప్ - 3 పరీక్షల తేదీల ఖరారుకు ఇంకెంత కాలం పడుతుందన్నదే అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతోంది.

Tags:    
Advertisement

Similar News