తెలంగాణలో టీఎస్ ఐ-పాస్ వల్ల పారిశ్రామిక ప్రగతి పెరిగింది : సీఎం కేసీఆర్
గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ లేదనే బాధే కాకుండా.. ఇక్కడి యువత ప్రతిభ, నైపుణ్యాలు ఉపయోగించుకోలేక పోతున్నామనే ఒక వెలితి ఉండేది.
`తెలంగాణలో రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీ వస్తుందని ఏనాడూ ఊహించలేదు. ఇక్కడ రైల్ ఫ్యాక్టరీ ఏంటని ఆలోచించాను. కానీ ఈ రోజు మేధా ఫ్యాక్టరీని పరిశీలిస్తే.. ఎంతో నాణ్యత, నైపుణ్యంతో విడి భాగాలు తయారు చేస్తుంటే ఆశ్చర్యపోయాను. ఫ్యాక్టరీ మొత్తం చూశాక చాలా సంతోషం వేసింది. ఈ ఫ్యాక్టరీని నిర్మించిన కశ్యప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డికి నా అభినందనలు తెలియజేస్తున్నా`నని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో నూతనంగా నిర్మించిన మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ లేదనే బాధే కాకుండా.. ఇక్కడి యువత ప్రతిభ, నైపుణ్యాలు ఉపయోగించుకోలేక పోతున్నామనే ఒక వెలితి ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మన బిడ్డలు దేశానికి, ప్రపంచానికి రైళ్లు తయారు చేసే ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ తీసుకొని రావడం చాలా గర్వకారణంగానే కాకుండా, ఆ వెలితిని పూడ్చినట్లు ఉందని సీఎం చెప్పారు. రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఫేజ్-1 పూర్తి చేసి.. మాన్యుఫ్యాక్చరింగ్ కూడా మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా, పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెందింది. జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్స్ తయారీ భారీగా ఉన్నది. ప్రపంచంలోనే మూడో వంతు వ్యాక్సిన్ మన హైదరాబాద్‌లోనే తయారు చేస్తున్నాము. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే.. అలాంటి మంచి వాతావరణం హైదరాబాద్‌లో మా ప్రభుత్వం ఏర్పరచిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా కఠినమైన నిర్ణయం తీసుకొని.. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండొద్దని టీఎస్ ఐ-పాస్ తీసుకొని వచ్చినట్లు కేసీఆర్ వివరించారు.
ప్రపంచంలోనే ఎక్కడ కూడా టీఎస్ ఐ-పాస్ లాంటి పద్దతి లేదు. దాదాపు 70 దేశాల్లో అధ్యయనం చేసి ఈ సిస్టమ్ తీసుకొని వచ్చాము. మన టీఎస్ ఐ-పాస్ ఎలాంటి అక్రమాలకు తావు లేని చట్టం. దీని వల్లే తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి, ఐటీ ప్రగతి పెరుగుతోందని కేసీఆర్ వెల్లడించారు. ఇదే టీఎస్ ఐ-పాస్ ఉపయోగించుకొని మేధా గ్రూప్ గొప్ప ప్రాజెక్టును ప్రారంభించిందని కేసీఆర్ చెప్పారు.
పారిశ్రామికవేత్తలకు ఎలాంటి సమస్యలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటారు. పరిశ్రమలు ప్రారంభించి.. రాష్ట్ర, దేశ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.