మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్ ని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మంత్రి పిటిషన్ ని కొట్టివేసింది.
ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ని కొట్టివేయాలని మంత్రి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఈమేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ ని ఈరోజు కొట్టివేసింది. దీంతో ఆయన అనర్హతపై వేసిన పిటిషన్ విచారణకు హైకోర్టు సమ్మతించినట్టయింది.
అసలేం జరిగింది..?
2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుతం ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్ కి చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు ధృవపత్రాలు సమర్పించారనేది రాఘవేంద్రరాజు ఆరోపణ. అయితే రాఘవేంద్రరాజు వేసిన పిటిషన్ ని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మంత్రి పిటిషన్ ని కొట్టివేసింది.
కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే రోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విషయం కూడా తేలిపోవడం ఆసక్తిగా మారింది. రాఘవేంద్రరాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్ ని విచారణకు అనుమతించిన హైకోర్టు.. శ్రీనివాస్ గౌడ్ అనర్హతపై ఎలాంటి తీర్పునిస్తుందనేది వేచి చూడాలి.