TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు...గత సంవత్సరం కంటే 53,873 అధికం
TS EAMCET 2023: ఈ సంవత్సరం తెలంగాణ ఎంసెట్ కోసం రికార్డు స్థాయిలో విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సంవత్సరం తెలంగాణ ఎంసెట్ కోసం రికార్డు స్థాయిలో విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది 2,66,714 మంది దరఖాస్తు చేయగా ఈ ఏడాది 3,20,587 అప్లికేషన్స్ వచ్చాయి.
2022సంవత్సరంతో పోలిస్తే 53,873 దరఖాస్తులు ఎక్కువ. రూ.5000 ఆలస్య రుసుం తో ఈరోజు (మంగళవారం) రాత్రి వరకు గడువు ఉండడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.
అభ్యర్ధులు https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ....గత రెండు విద్యా సంవత్సరాల్లో ఇంటర్ మీడియట్ అడ్మిషన్లు పెరగడమే EAMCET 2023 కి ఎక్కువ మంది అప్లయ్ చేయడానికి కారణమని అన్నారు. దీంతో పాటు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లను కూడా EAMCET ద్వారా భర్తీ చేస్తుండడం కూడా ఒక కారణమని చెప్పారు. ఈ నెల 10 నుంచి 14వరకు EAMCET పరీక్ష జరగనుంది. మే 10,11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్, 12,13,14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అగ్రికల్చర్, మెడికల్ కోసం 113, ఇంజనీరింగ్ కోసం 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ కంప్యూటర్ పద్దతిలో నిర్వహిస్తున్నారు.
పరీక్షలు సాఫీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. పరీక్ష నిర్వహణకు గతంలో మాదిరిగా ప్లైయింగ్ స్క్వాడ్ కు బదులు సిట్టింగ్ స్వ్కాడ్ ను నియమిస్తున్నట్టు చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్ (CS),అబ్జర్వర్లు తప్ప ఇతర అధికారులెవరూ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. అదే విధంగా TSEdCET, ECET,LAWCET,PGLCET పరీక్షలన్నీ ఒకే రోజులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రొఫెసర్ లింబాద్రి చెప్పారు.