నవంబర్ 20 నుంచి టీఆర్టీ.. 5,089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ

నవంబర్ 20 నుంచి 30 వరకు జరిగే పరీక్షల కోసం ఈ నెల 20 నుంచి అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులు బాటు ఉన్నది.

Advertisement
Update:2023-09-08 06:21 IST

బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకొని.. ఉపాద్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు  కోసం ఎదురు చేస్తున్నారు. టీఆర్టీ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేయడంతో అందరూ ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. ఈ క్రమంలో నవంబర్ 20 నుంచి 30వ తేదీ మధ్య టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

తొలి సారిగా టీఆర్టీని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహించనున్నారు. 5,089 ఉపాధ్యాయుల ఖాళీలతో పాటు 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీని చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దీనికి ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. అయితే తాజాగా విడుదల చేసిన నోటిఫకేషన్‌లో సెకెండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), పీఈటీలు, భాషా పండితుల పోస్టులను పేర్కొన్నారు. అయితే 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీ గురించి మాత్రం ప్రస్తావించలేదు. అయితే ఈ నెల 15న పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో ఉంచుతామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. అందులో జిల్లాల వారీగా ఖాళీలు, ఇతర వివరాలు ఉండనున్నాయి. దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల గురించి పేర్కొనే అవకాశాలు ఉన్నాయి.

ఇక నవంబర్ 20 నుంచి 30 వరకు జరిగే పరీక్షల కోసం ఈ నెల 20 నుంచి అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులు బాటు ఉన్నది. దరఖాస్తు ఫీజుగా రూ.1000 నిర్ణయించారు. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 20 వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సడలింపు వర్తించనున్నది. ఇక దివ్యాంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

తొలి సారిగా కంప్యూటర్ బేస్డ్‌గా నిర్వహిస్తున్న ఈ టెస్టుకు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News