మోదీ చెప్పక్కర్లేదు.. ఆ రైతుని కనిపెట్టేశారు..
ప్రధాని కార్యాలయం ఆ రైతు వివరాలు చెప్పలేదు కానీ, టీఆర్ఎస్ టెక్నికల్ టీమ్ ఆయన్ని వెతికి పట్టుకుంది. బండారం మొత్తం బయటపెట్టింది.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా తన ఆదాయం రెట్టింపు చేసుకున్న ఆ రైతు ఎవరో తెలిసిపోయింది. కేంద్ర వ్యవసాయ శాఖ వేసిన ట్వీట్ లో ఆదాయం రెట్టింపైనందుకు సంతోషంగా ఉన్న రైతు ఎవరో కనిపెట్టేశారు. మంత్రి కేటీఆర్ ప్రశ్నించినందుకు ప్రధాని కార్యాలయం ఆ రైతు వివరాలు చెప్పలేదు కానీ, టీఆర్ఎస్ టెక్నికల్ టీమ్ ఆయన్ని వెతికి పట్టుకుంది. బండారం మొత్తం బయటపెట్టింది. ఇదిగో ఆ రైతు వివరాలివే అంటూ టీఆర్ఎస్ టెక్ టీమ్ ఓ ట్వీట్ పెట్టింది.
ఎవరా రైతు..?
ఆయన రైతు కాదు, ఓ మోడల్. అవును బీజేపీ తరఫున వివిధ ప్రమోషనల్ యాడ్స్ లో నటించిన మోడల్. ఆయనతో ఫొటో షూట్ చేసి ఇప్పుడు రైతు యాడ్ ని కూడా రక్తి కట్టించింది బీజేపీ. కానీ దాన్ని వ్యవసాయ శాఖ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసి అడ్డంగా బుక్ అయింది. రాజకీయ పార్టీలు ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయడం సహజమే, కానీ నేరుగా ప్రభుత్వమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం. డిజిటల్ మీడియా మెడమీద కత్తిపెట్టాలనుకుంటున్న ప్రభుత్వం, తనకు తానే ఎలాంటి నీచాలకు పాల్పడుతుందో ఇలా చెప్పుకుంటోంది.
కేటీఆర్ ప్రశ్నించడంతో వెలుగులోకి..
దేశంలో రైతుల ఆదాయం రెట్టింపైందంటూ.. కేంద్ర వ్యవసాయ శాఖ వేసిన ఓ ట్వీట్ కి బదులిస్తూ కేటీఆర్ మూడు ప్రశ్నలు సంధించారు. అసలు దేశంలో ఏ రైతు ఆదాయం రెట్టింపైంది, ఎంతమందికి రెట్టింపైంది, వారి వివరాలు చెప్పండి అంటూ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని కార్యాలయం సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. దీంతో టీఆర్ఎస్ టెక్నికల్ సెల్ అలర్ట్ అయింది. అసలు ప్రచారంలో కనిపిస్తున్న ఆ రైతు ఎవరో కనుక్కునే ప్రయత్నం చేసింది. ఇంకేముంది పాత ప్రచార చిత్రాలన్నీ బయటకొచ్చాయి. అందులో ఇందులో ఉన్న వ్యక్తి ఒకరే. ఆయనే మధ్యతరగతి మనిషి, ఆయనే చిరువ్యాపారి, ఆయనే రైతు, ఆయనే కార్మికుడు. ఇలా బీజేపీ ఆయన్ని అన్నిరకాల ప్రచారాల్లో ఉపయోగించుకుంది, ఇప్పుడిలా అడ్డంగా బుక్కైంది.