ఒక్కసారిగా జోరు పెంచిన కారు

బీజేపీలోని దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్లను టీఆర్ఎస్ లాగేసుకుంది. పనిలోపనిగా ఇంకా చాలామంది కమలనాధులను చేర్చుకోవటానికి వ్యూహాలు రచిస్తున్నారట. హైదరాబాద్ లో మునుగోడుకు సంబంధించిన కులసంఘాలు, ప్రజాసంఘలతో టీఆర్ఎస్ కీలకనేతలు సమావేశాలు అవుతున్నట్లు సమాచారం.

Advertisement
Update:2022-10-23 14:29 IST

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో కారుజోరు ఒక్కసారిగా పెరిగింది. ప్రత్యర్థి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. వైరి పార్టీల్లోని నేతలను ఆకర్షించటం, ప్రజాసంఘాలు, కులసంఘాలతో సమావేశాలు, కీలకంగా వ్యవహరిస్తున్న నేతలను పార్టీలోకి చేర్చుకోవటం చకచక జరిగిపోతున్నది. ఇదే సమయంలో తొందరలోనే నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగ సభలు, రోడ్డు షోలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఏకకాలంలో ప్రత్యర్థి పార్టీలను కారు పార్టీ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీ లాక్కుంటే బీజేపీలోని దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్లను టీఆర్ఎస్ లాగేసుకుంది. పనిలోపనిగా ఇంకా చాలామంది కమలనాధులను చేర్చుకోవటానికి వ్యూహాలు రచిస్తున్నారట. హైదరాబాద్ లో మునుగోడుకు సంబంధించిన కులసంఘాలు, ప్రజాసంఘలతో టీఆర్ఎస్ కీలకనేతలు సమావేశాలు అవుతున్నట్లు సమాచారం. ఎల్బీనగర్, వనస్థ‌లిపురం ప్రాంతాల్లో ఈ భేటీలు జరుగుతున్నాయట.

ఎల్బీనగర్, హయత్ నరగ్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మునుగోడు ఓటర్లు సుమారు 30 వేలమంది ఉన్నారట. అందుకనే పార్టీలన్నీ వీరిని మంచిచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ కారణంగా బీజేపీ, కాంగ్రెస్ ఈ ప్రయత్నాల్లో వెనకబడినట్లు సమాచారం. పై ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారట. అందుకనే టీఆర్ఎస్ ముఖ్యులు ఆర్టీసీ ఉద్యోగ నేతలను దగ్గరపెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక మునుగోడులో బీఎస్పీ, జనసేన ఓట్లు కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని సమాచారం. ఇందుకనే పార్టీలన్నీ పై రెండుపార్టీల స్ధానిక నేతలతో టచ్ లో ఉన్నారట.

మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి అదే పద్దతిలో ఈ ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని కారుపార్టీ నేతలు జనసేనను కోరినట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీ, కాంగ్రెస్ కు ఏ స్థితిలో కూడా ఊపిరిఆడకుండా గట్టిగా బిగించేందుకే కేసీఆర్ గట్టి వ్యూహాలను పన్నుతున్నట్లు అర్థ‌మవుతోంది. మరి కేసీఆర్ ఉచ్చులోనుండి పై రెండుపార్టీలు ప్రధానంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎలా బయటపడతారన్నది ఆసక్తిగా ఉంది.

Tags:    
Advertisement

Similar News