జైల్లో పెడుతారా..? పెట్టుకోండి.. భయపడం- ఎమ్మెల్సీ కవిత

కేసులను చూసి టీఆర్‌ఎస్‌ శ్రేణులు కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. దర్యాప్తు సంస్థలొచ్చి అడిగితే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement
Update:2022-12-01 11:37 IST

ఈడీ, సీబీఐ కేసులను భయపడే ప్రసక్తే లేదన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహా అయితే ఏం చేస్తారు? జైలులో పెడుతారా? పెట్టుకోండి అని సవాల్ చేశారు. మోడీ అధికారం చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చారని కవిత విమర్శించారు. తన మీద కావొచ్చు, టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల మీద కావొచ్చు ఈడీ కేసులు పెట్టడం ఇకపై సర్వసాధారణంగానే జరుగుతుందన్నారు. అది బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడలో భాగం మాత్రమేనన్నారు.

కేసులను చూసి టీఆర్‌ఎస్‌ శ్రేణులు కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. దర్యాప్తు సంస్థలొచ్చి అడిగితే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలా కాకుండా మీడియాకు లీకులిచ్చి నాయకుల ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే ప్రజలే తిప్పికొడుతారన్నారు.

ప్రజల వద్దకు వెళ్లి విధానాలను వివరించడం ద్వారా కాకుండా ఈడీ, సీబీఐల ద్వారా గెలవాలనుకుంటే సాధ్యం కాదని.. మరీ ముఖ్యంగా చైతన్యవంతమైన ప్రజలున్న తెలంగాణలో అస్సలు సాధ్యం కాదన్న విషయాన్ని నరేంద్రమోడీ గుర్తుంచుకోవాలన్నారు. అయినా సరే కేసులు పెడుతాం, జైల్లో పెడుతాం అంటే.. పెట్టుకోండి.. జైల్‌లో పెట్టి ఏం చేస్తారు?. ఉరి తీస్తారా..?. ప్రజలు మాతో ఉన్నంత కాలం.. ఏమీ చేయలేరు. భయపడేది లేదు.'' అని కవిత వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News