ఇద్దరం తెల్లకాగితంపై సంతకాలు చేద్దాం- షర్మిలకు సుదర్శన్ రెడ్డి ఛాలెంజ్

వైఎస్ హయాంలో తెలంగాణను ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. తన ఆస్తులపై షర్మిల చేసిన ఆరోపణలకు స్పందించిన ఆయన.. తాను తెల్లకాగితంపై సంతకం చేసి ఇస్తానని.. షర్మిల కూడా తెల్లకాగితంపై సంతకం చేసి ఇవ్వాలన్నారు.

Advertisement
Update:2022-12-01 13:03 IST

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఒకప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ అని, ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగిగా చేశారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారంటూ వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలపై సుదర్శన్ రెడ్డి స్పందించారు.

వైఎస్ హయాంలో తెలంగాణను ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. తన ఆస్తులపై షర్మిల చేసిన ఆరోపణలకు స్పందించిన ఆయన.. తాను తెల్లకాగితంపై సంతకం చేసి ఇస్తానని.. షర్మిల కూడా తెల్లకాగితంపై సంతకం చేసి ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ఇరువురి ఆస్తులు ఎంతున్నాయో బయటకు తోడుదామని సవాల్ చేశారు. తనకు షర్మిల చెప్పినట్టు ఆస్తులుంటే వాటిని తెలంగాణ ప్రజలకే రాసిస్తానని.. షర్మిల కూడా ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఎమ్మెల్యేల్లోనే అతి పేదవాడిగా ఉన్న తనను ఉద్దేశించి ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

తెల్లకాగితాలపై సంతకాలు చేసిన తర్వాత ఎవరి ఆస్తులేంటో తేల్చుకుందామని.. ఇలా చేస్తే సిట్‌లు, సిట్టింగ్ జడ్జిలతో కూడా పని ఉండదని సవాల్ చేశారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చిన హైకోర్టు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని చెప్పిందని.. పరిధిలు దాటకుండా యాత్ర చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

అలా కాకుండా దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజలే తిరగబడుతారన్నారు. అసలు షర్మిల మాట్లాడుతున్న మాటల్లో ఒక్కటైనా ప్రజలకు ఉపయోగపడేది ఉందా అని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టే ఉద్దేశంతోనే షర్మిల రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పట్టుకుని మగతనం లేదా.. వాడు,వీడు అంటూ మాట్లాడడం ఏం సంస్కారం అని సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. మేం కూడా ఏపీకి వెళ్లి జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇలాంటి మాటలే మాట్లాడితే ఊరుకుంటారా అని నిలదీశారు. ఇంత చిల్లరమాటలు మాట్లాడే మహిళా నాయకురాలిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.

Advertisement

Similar News