ఉత్కంట పోరులో టీఆరెస్ దే విజయం

మునుగోడు ఉప ఎన్నికలో టీఆరెస్ విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఉత్కంట పోరులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించి టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు.

Advertisement
Update:2022-11-06 17:24 IST

మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలను తీవ్ర హైరానాకు గురి చేసింది. టీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగినప్పటికీ టీఆరెస్, బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ కేంద్రీకృతమైంది. ఈ నెల 3వ తేదీన ఎన్నికలు జరిగిన మునుగోడులో ఈ రోజు కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్ ప్రారంభం నుండే టీఆరెస్ లీడ్ లో ఉన్నది. కానీ టీఆరెస్, బీజేపీ ల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండటం ఇరు పార్టీలకు కలవరం కలిగించింది. మొదటి రౌండ్ లో టీఆరెస్ ఆధిక్యం సాధించగా రెండవ, మూడవ రౌండ్ లలో బీజెపి ఆధిక్యం సాధించినప్పటికీ మిగతా 12 రౌడ్లలోనూ ప్రతి రౌండ్ లో టీరెస్ పార్టీయే ఆధిక్యం సాధించింది.

మొత్తం 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్ లెక్కింపు ఇరు పార్టీ ల నాయకులను, కార్యకర్తలను ఉత్కంటకు గురి చేశాయి. అయితే 13వ‌ రౌండ్ లెక్కింపు జరుగుతుండగానే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకొని, టీఆరెస్ మీద ఆరోపణలు గుప్పించి కౌంటింగ్ కేంద్రం నుంచి బైటికి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అయితే మూడవ రౌండ్ లోనే వెళ్ళిపోయారు.

చివరకు 15వ రౌండ్ తర్వాత టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 97,006 ఓట్లు రాగా రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. 

మరో వైపు మునుగోడు గెలుపుతో టీఆరెస్ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఇటు తెలంగాణభవన్ లోనూ, అటు మునుగోడులోనూ టీఆరెస్ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటున్నారు.  

Tags:    
Advertisement

Similar News