తగ్గేదే లేదు.. ఫ్రీ సింబల్స్‌పై పోరాటం ఆపని టీఆర్ఎస్
ఎన్నికల్లో గుర్తు అనేది ఎంత పవర్ ఫుల్ సాధనమో అన్ని పార్టీలకు తెలుసు. ఇటీవల శివసేన పార్టీ చీలిపోయినప్పుడు ఇరు వర్గాలు విల్లు, బాణం గుర్తు కోసం ఎంత పట్టుబట్టాయో తెలిసిందే.
కారు గుర్తును పోలిన ఫ్రీ సింబల్స్ కారణంగా ఎన్నికల్లో పార్టీకి వస్తున్న నష్టం విషయంలో టీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్‌గా ఉన్నది. ఎప్పటి నుంచో కారు గుర్తును పోలిన వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ కోరుతున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చింది. ఓటర్లు ఏ విధంగా కన్ఫ్యూజ్ అవుతున్నారనే విషయాన్ని రుజువులతో సహా ఇచ్చినా ఈసీఐ పట్టించుకోవడం లేదు. అయినా సరే టీఆర్ఎస్ మాత్రం తమ పోరాటాన్ని ఆపడం లేదు. ఎలాగైనా సరే వాటిని తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నది.
గతంలో ఈ విషయంలో కాస్త అలసత్వంగా ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడు మాత్రం సీరియస్‌గా రంగంలోకి దిగింది. అప్పట్లో ఎన్నికల సమయంలో మాత్రమే ఎలక్షన్ కమిషన్‌కు పలుమార్లు లేఖలు రాసింది. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ ఆనే పేరు మార్చారు. ప్రస్తుతం దీనికి ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేయాల్సి ఉన్నది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనున్నది. టీఆర్ఎస్ పార్టీ సింబల్ అయిన కారునే బీఆర్ఎస్‌కు కూడా కొనసాగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరనున్నది. అదే సమయంలో కారు గుర్తును పోలిన ఫ్రీ సింబల్స్‌ను తొలగించాలని కూడా పట్టుబడుతున్నది. సీఎం కేసీఆర్ ఈ విషయంలో వెనక్కి తగ్గ వద్దని.. ఫ్రీ సింబల్స్ తొలగించే వరకు పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.
కారు గుర్తును పోలిన కెమేరా, చపాతీ మేకర్, డోలి, రోడ్డు రోలర్, సోప్ బాక్స్, టెలివిజన్, కుట్టు మిషన్, షిప్‌ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని టీఆర్ఎస్ కోరుతున్నది. ముఖ్యంగా చపాతీ మేకర్, సోప్ బాక్స్, రోడ్డు రోలర్, కెమేరా అయితే పూర్తిగా కారు లాగానే ఉంటున్నాయి. ఎన్నికల కమిషన్ వాటి రూపు రేఖలు కూడా మార్చడం లేదు. చాలా మంది ఆ గుర్తులను చూసి కారుగానే పొరబడుతున్నారు. ఇటీవల ముగిసిన మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన గుర్తు కలిగిన అభ్యర్థులకు 6 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆయా అభ్యర్థులు కనీసం ప్రచారం చేయకపోయినా.. కారు గుర్తును పోలిన రోటీ మేకర్, రోడ్డు రోలర్ ఉండటంతో గణనీయంగా ఓట్లు పడ్డాయి. జాతీయ పార్టీ అయిన బీఎస్పీకి 4,146 ఓట్లు రాగా.. వీళ్లకు మాత్రం 6వేలకు పైగా ఓట్లు రావడాన్ని టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకున్నది. 2018 ఎన్నికల సమయంలో నర్సంపేట నియోజకవర్గంలో కెమేరా గుర్తుకు 9,052 ఓట్లు పడ్డాయి. అదే నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీకి కలిపి 15 వేల ఓట్లు వచ్చాయి. కెమేరాకు పడినవి టీఆర్ఎస్‌కు పడాల్సిన ఓట్లే అని వాదిస్తోంది.
ఎన్నికల్లో గుర్తు అనేది ఎంత పవర్ ఫుల్ సాధనమో అన్ని పార్టీలకు తెలుసు. ఇటీవల శివసేన పార్టీ చీలిపోయినప్పుడు ఇరు వర్గాలు విల్లు, బాణం గుర్తు కోసం ఎంత పట్టుబట్టాయో తెలిసిందే. అందుకే పార్టీకి నష్టం చేకూరుస్తున్న కొన్ని గుర్తులు తొలగించాల్సిందేనని టీఆర్ఎస్ అంటోంది. 2018, 2019లో జరిగిన తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్రక్కు, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ గుర్తులను ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించారు. అవి కారు గుర్తును పోలి ఉన్నాయని టీఆర్ఎస్ లేఖ రాయడంతోనే ఎన్నికల కమిషన్ ఆ నిర్ణయం తీసుకున్నది. అయతే మరో 7 సింబల్స్ తొలగింపునకు టీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్‌ను ఈసీఐ తోసి పుచ్చుతున్నది. ఇలా పార్టీలు కోరే సింబల్స్ అన్నీ తొలిగించుకుంటూ పోవడం కుదరదని అంటోంది.
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయంగా ఓ యుద్దమే నడుస్తోంది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. కావాలనే కొంత మంది ఇండిపెండెంట్లను రంగంలోకి దింపి వారికి రోటీ మేకర్, రోడ్డు రోలర్, సోప్ బాక్స్ వంటి గుర్తులు వచ్చేలా చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అభ్యర్థులు ఏ మాత్రం ఓట్లు చీల్చినా కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు భారీ నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి. వెయ్యి, రెండువేల ఓట్ల మెజార్టీ వచ్చే సెగ్మెంట్లలో మునుగోడు మాదిరిగా 6 వేల ఓట్లు చీలిపోతే అది టీఆర్ఎస్‌కు నష్టమే. ఇక బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశవ్యాప్తంగా పోటీ చేయాలని భావిస్తున్న సమయంలో కారు గుర్తును పోలిన సింబల్స్ తప్పకుండా అవరోధంగా మారుతాయి.
2021లో ఈసీఐ కొన్ని గుర్తులను ఫ్రీ సింబల్స్‌గా పేర్కొన్నది. వీటిలో నుంచి మూడు గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులు, అన్‌రికగ్నైజ్డ్ పార్టీ క్యాండిడేట్లు ఎంపిక చేసుకోవాలి. లాటరీ పద్దతిలో వారికి ఎన్నికల సమయంలో గుర్తులు కేటాయిస్తారు. అయితే 2011లో రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తును ఈసీఐ తిరిగి ప్రవేశపెట్టిందని టీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ అంటున్నారు. కావాలనే మునుగోడు ఉపఎన్నిక సమయంలో దాన్ని తీసుకొని వచ్చినట్లు తెలుస్తున్నదని ఆరోపిస్తున్నారు. రిటర్నింగ్ అధికారికి గుర్తులను కేటాయించే లేదా రద్దు చేసే అధికారం ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎలక్టోరల్ రిఫామ్స్ రావాలని ఆయన కోరుతున్నారు.
2014లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాంటి ఫ్రీ సింబల్స్ కారణంగా ఇబ్బంది పడింది. పార్టీ సింబల్ అయిన చీపురు గుర్తును పోలిన టార్చ్ లైట్ కారణంగా ఢిల్లీలోని చాలా నియోజకవర్గాల్లో నష్టపోయింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని రావడంతో టార్చి లైట్ గుర్తును పూర్తిగా మార్చేసి, చీపురు గుర్తుతో పోలిక లేకుండా చేసింది. ఇప్పుడు టీఆర్ఎస్ కోరుతున్నట్లు ఆ సింబల్స్‌ను తొలగించకపోయినా.. కారు గుర్తుకు దగ్గరగా లేకుండా పూర్తిగా మార్చి వేయాలనే సూచన కూడా వస్తోంది.ముఖ్యంగా చపాతీ మేకర్ గుర్తును 3డీలో ముద్రిస్తే ఏ ఇబ్బంది ఉండదని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎర్రబెల్లి రజనీకాంత్ అంటున్నారు. చాలా గుర్తులు 3డీలో క్లియర్‌గా కనిపించేలా ముద్రించాలని ఆయన సూచిస్తున్నారు. మరి టీఆర్ఎస్ ఈ సూచనకు ఒప్పుకుంటుందో లేదో కానీ.. గుర్తులపై పోరాటాన్ని మాత్రం కొనసాగించాలనే నిర్ణయించింది.