సూది కోసం సోది మీటింగ్‌.. మోడీ నిర్వాకం బయటెట్టిన టీఆర్‌ఎస్‌

తెలంగాణ జీఎస్‌డీపీలో 23 శాతానికి మించి అప్పులు చేసిందంటూ పదేపదే తెలంగాణ పేరును ప్రస్తావించడంపై టీఆర్‌ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు అభ్యంతరం

Advertisement
Update:2022-07-20 07:30 IST

శ్రీలంక పరిస్థితులను వివరించేందుకు అంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. శ్రీలంక పరిస్థితులను వివరించేందుకంటూ సమావేశం పెట్టి.. ఆ తర్వాత తనకు గిట్టని పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లోని అప్పులపైకి చర్చ మళ్లించారు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు.

దేశంలో 10 రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయంటూ ఆ గణాంకాలను ప్రదర్శించారు. ఏపీ, తెలంగాణ, పంజాబ్, కేరళ, బెంగాల్‌, రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయని.. పరిస్థితి ఇలాగే ఉంటే ఆయా రాష్ట్రాలు శ్రీలంక లాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని.. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను దాటేశారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వివరించారు.

తెలంగాణ జీఎస్‌డీపీలో 23 శాతానికి మించి అప్పులు చేసిందంటూ పదేపదే తెలంగాణ పేరును ప్రస్తావించడంపై టీఆర్‌ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు అభ్యంతరం తెలిపారు. శ్రీలంక గురించి చెబుతామంటూ పిలిచి రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలతో పాటు ఆ తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, డీఎంకే, తృణముల్‌ ఎంపీలు కూడా కేంద్రం తీరుపై అభ్యంతరం తెలిపారు.

గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారంటూ అభ్యంతరం తెలిపారు. టీఆర్‌ఎస్ ఎంపీలు మరో అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వ అప్పుల గురించి ప్రశ్నించారు. తెలంగాణ జీఎస్‌డీపీలో 25 శాతం వరకు అప్పులు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ చేసింది 23 శాతమేనని.. అదే కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 40 శాతం అప్పు చేయాల్సి ఉండగా.. ఏకంగా 59 శాతం చేసిందని.. దానికి ఎవరు సమాధానం చెబుతారంటూ టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నిలదీశారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యేనాటికి దేశం అప్పు 57 లక్షల కోట్లుగా ఉంటే.. మోడీ వచ్చిన తర్వాత ఏకంగా మరో 100 లక్షల కోట్లు అప్పును కేంద్రం తెచ్చిందని దానికి సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిలదీశారు.

తీసుకున్న అప్పులు చెల్లించడంతో శ్రీలంకలాగా తెలంగాణ ఎప్పుడైనా విఫలమైందా చెప్పండి అంటూ కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిలదీశారు. ఇలా పలు పార్టీల ఎంపీలు ఒక్కసారిగా సమావేశ చిత్తశుద్దిని ప్రశ్నించడంతో స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని.. ఉచిత పథకాలు మానుకుని ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిందిగా చెప్పడమే ఉద్దేశమని వివరణ ఇచ్చారు. శ్రీలంక నుంచి ముందే గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన అతి భారీ అప్పులపై విపక్ష ఎంపీలు సంధించిన ప్రశ్నలకు మాత్రం సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సమాధానం చెప్పలేదు.

సూది కోసం సోదికి వెళ్తే మరేదో బయటపడినట్టు.. రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు తమ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ అప్పుల సంగతి తెరపైకి రావడంతో కంగుతిన్నారు.

Tags:    
Advertisement

Similar News