నల్గొండ జిల్లా.. టీఆర్ఎస్ ఖిల్లా
హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లో సిట్టింగ్ స్థానాలు కాపాడుకున్న టీఆర్ఎస్, మునుగోడులో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరిపోయినట్టయింది. నల్గొండ జిల్లా మొత్తంలో ఇలా ఒకేపార్టీ అన్ని స్థానాలు దక్కించుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కి చెందినవారే కావడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఇలాంటి అద్భుత ఫలితాన్నిచ్చిన నల్గొండ జిల్లా వాసులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉంచినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే హవా..
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం తెలంగాణలో ఐదు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. దుబ్బాకలో టీఆర్ఎస్ సీటు బీజేపీకి వెళ్లిపోగా, హుజూరాబాద్ లో ఈటల పార్టీమారి గెలుపొందారు. మిగిలిన మూడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజేతగా నిలిచింది. ఈ మూడు నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండటం విశేషం. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లో సిట్టింగ్ స్థానాలు కాపాడుకున్న టీఆర్ఎస్, మునుగోడులో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్. మునుగోడు ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే వెంటనే ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు. మిగిలిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలనాటికి మునుగోడు అభివృద్ధిలో మార్పు చూపిస్తామన్నారు మంత్రి కేటీఆర్.