సమైక్య రాష్ట్రంలోనే బాగుండే.. తెలంగాణ అవసరమే లేదు - రేవంత్
తెలంగాణ ప్రజలు ఏనాడూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు నీళ్లివ్వలేదా అంటూ ఎదురు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. శుక్రవారం ఓ మీడియా సంస్థ క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసలు అవసరమే లేదన్నట్లుగా మాట్లాడారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు మండిపడుతున్నారు.
ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే..! తెలంగాణ ప్రజలు ఏనాడూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు నీళ్లివ్వలేదా అంటూ ఎదురు ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ప్రాణహిత -చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి లాంటి పథకాలు ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలయ్యాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి నిధులిచ్చారంటూ ఆంధ్రా పాలకులను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 8 డీఎస్సీలు ఇచ్చిందన్నారు రేవంత్. కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే అయితే తెలంగాణ అవసరమే లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచేలా రేవంత్ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల మీట్ ది ప్రెస్ కార్యక్రమంలోనూ ఇదే తరహా కామెంట్స్ చేశారు. సాంకేతికంగా లెక్కలేసుకుంటే తెలంగాణ ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశం లేదన్నారు. రాజకీయ కోణంలో చూసినా తెలంగాణ ఏర్పాటుతో ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నష్టం చేకూర్చే నిర్ణయమేనన్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద స్కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఉన్న అవగాహన ఇదంటూ ట్వీట్ చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమించలేదని.. ఒకవేళ వాటి కోసమే అయితే తెలంగాణ అవసరం లేదంటున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఉద్యమకారులు సైతం రేవంత్ కామెంట్స్‌పై మండిపడుతున్నారు. ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకుని వెళ్లిన చరిత్ర.. రేవంత్ రెడ్డిదని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ముందు పెట్టి తెలంగాణలో పార్టీ గెలవాలనుకోవడం కాంగ్రెస్ మూర్ఖత్వానికి నిదర్శనమంటున్నారు.