5 రాష్ట్రాల్లో గెలుస్తాం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం..!
తెలంగాణలో కాంగ్రెస్‌కు 38 శాతం, బీఆర్ఎస్‌కు 31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేల్లో తేలిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.
ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు సర్వేలు తేల్చాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 38 శాతం, బీఆర్ఎస్‌కు 31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేల్లో తేలిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.
వన్ నేషన్-వన్ ఎలక్షన్ వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధమన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనేది అంతిమంగా వన్ నేషన్ – వన్ పార్టీ కోసమేనని గతంలోనే తానూ చెప్పానన్నారు రేవంత్. కేంద్రం తీరు ఆ వాదనలకు బలం చేకూర్చే విధంగా ఉందన్నారు. దేశంలో ఒకే పార్టీ ఉండాలనే కుట్రతోనే ఈ ప్రయత్నాలు చేస్తోందన్నారు. చివరకు ఇది అధ్యక్ష తరహా ఎన్నికల దిశగా వెళ్తుందని, దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమిస్తుందని, దక్షిణ భారతదేశం ఉనికి ప్రశ్నార్థకమవుతుందని చెప్పారు.
ఇక వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు కేసీఆర్ గతంలోనే సానుకూలంగా స్పందించారని, 2016 జూలై 6న అప్పటి లా కమిషన్ ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌కు రాసిన లేఖలో కేసీఆర్ సానుకూలత వ్యక్తం చేశారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. కేసీఆర్ మౌనంగా ఉండడం బీజేపీకి సహకరించడానికేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వైఖరిని ఇప్పటికైనా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి బీజేపీ చేస్తున్న కుట్రకు బీఆర్ఎస్ తన వంతుగా సహకరిస్తున్నదని ఆరోపించారు. జమిలి ఎన్నికలకు కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి పార్టీలన్ని వ్యతిరేకమన్నారు.
♦