సభలతో ఉపయోగం లేదు.. ప్రతి ఇంటి తలుపు తట్టాల్సిందే..

అందరం సర్పంచ్ గా పోటీ చేస్తున్నామనుకొని కష్టపడాలని సూచించారు. ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలవాలన్నారు. ఈ ఉప ఎన్నిక ద్వార టీఆర్ఎస్, బీజేపీ ఓటమి చారిత్రక అవసరం అని చెప్పారు రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2022-09-13 07:37 IST

మునుగోడులో ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందే బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ సభలు పెట్టాయి. టీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ వచ్చారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చి వెళ్లారు. ఈ సభలతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల్లో జోష్ నిండింది. ప్రస్తుతానికి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ఉంది. కాంగ్రెస్ పరిస్థితి అలా లేదు. పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించారు కానీ, పెద్ద స్థాయి నాయకులెవరూ ఇంకా రాలేదు. సభలు పెట్టలేదు. రాహుల్ యాత్ర తెలంగాణకు రావాలంటే ఇంకా టైమ్ పడుతుంది. ఈలోగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సభలతో పెద్దగా ప్రయోజనం లేదని, కాంగ్రెస్ పార్టీ నేతలు మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపు తట్టాలని, ప్రతి ఓటర్ ని కలవాలని చెప్పారు.

సర్పంచ్ గా పోటీ చేస్తున్నామనుకోండి..

తెలంగాణలో ఉన్న 200 మంది ముఖ్య నాయకులను మునుగోడుకు పంపిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇన్ చార్జ్ గా, మరో ఇద్దరిని సహాయ ఇన్ చార్జ్ లను నియమించారు. ఒక్కొక్కరికి రెండు పోలింగ్ బూత్ ల చొప్పున 300 బూత్ లకు సంబంధించి 150 మంది నాయకులకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా సెప్టెంబర్ 18 నుంచి క్షేత్ర స్థాయిలో పని చేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి. అందరం సర్పంచ్ గా పోటీ చేస్తున్నామనుకొని కష్టపడాలని సూచించారు. ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలవాలన్నారు. ఈ ఉప ఎన్నిక ద్వారా టీఆర్ఎస్, బీజేపీ ఓటమి చారిత్రక అవసరం అని చెప్పారు రేవంత్ రెడ్డి. సభలకంటే ప్రతి ఒక్కరినీ ప్రత్యక్షంగా కలిసి అవగాహన కల్పించడమే ముఖ్యమన్నారాయన. ముఖ్యంగా కమ్యూనిస్ట్ లకు అవగాహన కల్పించాలని చెప్పారు.

అక్టోబర్ 24న రాహుల్ ఎంట్రీ..

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర అక్టోబర్ 24న తెలంగాణలో అడుగుపెడుతుందని, కృష్ణా నది బ్రిడ్జిపై రాహుల్ కి ఘన స్వాగతం పలుకుదామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగుతుందన్నారు. 15రోజులపాటు రోజుకొక పార్లమెంట్ కి సంబంధించిన నేత రాహుల్ తో కలసి నడుస్తారని అన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో రాహుల్ ప్రత్యేకంగా సమావేశమవుతారని చెప్పారు. మునుగోడు గెలుపు వ్యూహం రాహుల్ తో కలసి చర్చిస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News