టమాటా ఖేల్ ఖతం.. నెలాఖరులోగా రూ.50
తెలంగాణకు ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, కర్నాటక నుంచి టమాటా దిగుమతి అవుతుంది. దీనికి తోడు రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్ పేట, మెదక్ జిల్లాల నుంచి కూడా మార్కెట్ కు టమాటా రవాణా పెరిగింది. పెద్ద మొత్తంలో సరకు రావడంతో ధర తగ్గుతోందని అంటున్నారు వ్యాపారులు.
దాదాపు 2 నెలలుగా వంటింట్లో మహరాణిలా వెలిగిన టమాటా ఆటలిక సాగే పరిస్థితి లేదు. పంట దిగుబడి పెరగడం, వర్షాలు తగ్గి మార్కెట్లోకి రవాణా కూడా పెరగడంతో టమాటా రేటు ప్రస్తుతం నిలకడగా ఉంది. కొన్నిచోట్ల భారీగా పడిపోయింది. అయితే కృత్రిమ కొరత వల్ల రేటు ఆశించిన స్థాయిలో తగ్గలేదంటున్నారు అధికారులు. కానీ కచ్చితంగా నెలాఖరులోగా రూ.50కి టమాటా దిగొస్తుందని చెబుతున్నారు.
హైదరాబాద్ రైతుబజార్లో కిలో రూ.63
హైదరాబాద్ నగరానికి టమాటా రవాణా బాగా పెరిగింది. రెండు వారాల క్రితం రోజుకి హైదరాబాద్ నగరానికి 850 క్వింటాళ్ల సరఫరా జరిగేది, ఇప్పుడది 2450 క్వింటాళ్లకు పెరిగింది. దీంతో రైతు బజార్ లో టమాటా కేజీ రూ.63కే లభిస్తోంది. కానీ బయట మార్కెట్లలో కేజీ రూ.120 నుంచి రూ.140 మధ్యలో ఉంది. కానీ ఈ రేటు కూడా అతి కొద్ది రోజులే అని చెబుతున్నారు అధికారులు.
స్థానికంగా పెరిగిన దిగుబడి..
తెలంగాణకు ఎక్కువగా అనంతపురం, చిత్తూరు, కర్నాటక నుంచి టమాటా దిగుమతి అవుతుంది. దీనికి తోడు రంగారెడ్డి, వికారాబాద్, చేవెళ్ల, నవాబ్ పేట, మెదక్ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటా రవాణా పెరిగింది. పెద్ద మొత్తంలో సరకు రావడంతో ధర తగ్గుతోందని అంటున్నారు వ్యాపారులు. ఈ నెలాఖరుకు కిలో రూ.50లోపు దొరికే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.
రైతులకు లాభం..
మొత్తమ్మీద ఈ ఏడాది టమాటా సాగు చేసిన రైతు భారీగా లాభాలు కళ్లజూశారు. గతంలో నష్టమంతా ఒక్క దెబ్బకు సరిచేశారు. ఇంకొన్నాళ్లపాటు టమాటా రైతుకి దిగులు లేదని అంటున్నారు. టమాటాని నమ్ముకుని నష్టాల్లో కూడా సాగు చేసిన రైతులు ఇప్పుడు ఆ పంటను నమ్ముకున్నందుకు సంబరపడిపోతున్నారు. చాలామంది రైతులు టమాటా దెబ్బతో ఒడ్డునపడ్డట్టయింది.