టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చంద్రమోహన్ ఆ తర్వాత హీరోగా ఎదిగారు. 175 సినిమాల్లో హీరోగా నటించారు. చంద్రమోహన్ మొత్తం 932 చిత్రాల్లో నటించారు.
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ (80) ఇవాళ ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందారు. చంద్రమోహన్ కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించారు. 1966లో రంగులరాట్నం అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ముందుగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చంద్రమోహన్ ఆ తర్వాత హీరోగా ఎదిగారు. 175 సినిమాల్లో హీరోగా నటించారు. చంద్రమోహన్ మొత్తం 932 చిత్రాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా పలు వైవిధ్య పాత్రలు పోషించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, రాధా కళ్యాణం, రెండు రెళ్లు ఆరు వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తీసుకువచ్చాయి.
చంద్రమోహన్ తన సినీ జీవితంలో రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి.. ఆ తర్వాత చిరంజీవి తరం హీరోలతోపాటు ఇప్పటి యంగ్ జనరేషన్ హీరోల సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలు పోషించారు. పలు తమిళ సినిమాల్లో కూడా చంద్రమోహన్ నటించారు. గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ సినిమా చంద్రమోహన్ నటించిన చివరి చిత్రం.
చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ మృతితో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.