చివరి నిమిషంలో తుమ్మల సర్దుకున్నారా?

గురువారం ఉదయం తుమ్మలకు ఫోన్ చేసి కేసీఆర్‌ మాట్లాడారట. ఏమి మాట్లాడారనే విషయం బయటకు తెలియ‌లేదు కానీ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బలపరిచేందుకే అందరం కష్టపడి పనిచేయాలని పిలుపు ఇవ్వ‌డ‌మే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement
Update:2022-11-11 11:49 IST

చివరి నిమిషంలో తెర వెనుక జరిగిన పరిణామాల కారణంగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మనసు మార్చుకున్నారా? ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. గురువారం తన మద్దతుదారులతో తుమ్మల భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత వాజేడు మండల కేంద్రంలో ఆత్మీయ సమావేశం కూడా పెట్టుకున్నారు. తుమ్మల తొందరలోనే పార్టీ మారబోతున్నారనే ప్రచారం జిల్లాలో, పార్టీలో ఎప్పటి నుండో జరుగుతోంది.

కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ మరోవైపు తుమ్మలను చేర్చుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల్లోని ముఖ్యనేతలు తుమ్మలతో హైదరాబాద్‌లో భేటీలు కూడా అయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో తుమ్మలలో కాస్త అయోమయమైతే మొదలైంది. ఎందుకంటే తుమ్మలను కేసీఆర్‌ చాలా దూరంగా పెట్టేశారు. ఒకప్పుడు తుమ్మలకు కేసీఆర్‌ ఎంతగా ప్రాధాన్యతిచ్చారో ఇప్పుడు అంత దూరంపెట్టారు. ఈ విషయం పార్టీలోని ప్రతి ఒక్క‌రికీ తెలుసు.

జిల్లాలో తుమ్మల మాట ఏ రూపంలో కూడా చెల్లుబాటు కావటంలేదు. ఖమ్మం కార్పొరేషన్ అభ్యర్ధుల ఎంపికలో కూడా చివరకు తుమ్మలకు అవమానమే జరిగింది. ఒకప్పుడు జిల్లా మొత్తాన్ని కంటి చూపుతో శాసించిన తుమ్మలకు తాజా పరిణామాలు నిజంగా తీరని అవమానమనే చెప్పాలి. ఈ మాజీ మంత్రిని కేసీఆర్‌ దూరంగా పెట్టారని, వచ్చే ఎన్నికల్లో పాలేరులో టికెట్ ఇవ్వరనే ప్రచారం అందరికీ తెలిసిందే. మద్దతుదారుల మధ్య చర్చలు జరిగితే నష్టమేమీ లేదుకానీ ఆ విషయాన్ని మద్దతుదారులు డైరెక్టుగా తుమ్మలనే అడిగేస్తున్నారు. తుమ్మలను కలవటానికి కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదని సమాచారం.

ఇక్కడే తుమ్మలకు సమస్య మొదలైంది. అందుకనే కాంగ్రెస్, బీజేపీలోని కీలక నేతలతో భేటీ అయ్యింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మద్దతుదారులు, జనాల ముందు పలుచనైపోతాననే భయం పెరిగిపోతోంది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మద్దతుదారులతో వాజేడులో సమావేశం పెట్టుకున్నారు. సమావేశం జరగబోతున్న విషయం కేసీఆర్‌ దృష్టికి వెళ్ళింది. గురువారం ఉదయం తుమ్మలకు ఫోన్ చేసి కేసీఆర్‌ మాట్లాడారట. ఏమి మాట్లాడారనే విషయం బయటకు తెలియ‌లేదు కానీ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ.. కేసీఆర్‌ను బలపరిచేందుకే అందరం కష్టపడి పనిచేయాలని పిలుపు ఇవ్వ‌డ‌మే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Tags:    
Advertisement

Similar News