కడిగిన ముత్యంలా బయటకు వస్తా - కవిత
తాత్కాలికంగా తనను జైలులో పెడతారమే గానీ.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు కవిత. తప్పుడు ఆరోపణలతో తనపై కేసు పెట్టారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసుపై స్పందించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీలో చేరిపోయాడని.. మరో వ్యక్తికి బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు కవిత. ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి బీజేపీకి రూ.50 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చాడని ఆరోపించారు కవిత.
తాత్కాలికంగా తనను జైలులో పెడతారమే గానీ.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు కవిత. తప్పుడు ఆరోపణలతో తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ఈ కేసు అక్రమమని.. పోరాడతానని చెప్పారు. త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్రూవర్‌గా మారే ప్రసక్తే లేదన్నారు. ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కవిత.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు ఈ నెల 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. మరోవైపు ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం ఈడీ గత వారం అరెస్టు చేసింది.