ఇది యూరప్ కాదు... మన తెలంగాణనే
తెలంగాణలో కొనసాగుతున్న హరితహారంతో సహా ఈ మధ్య కురుస్తున్న వర్షాల మూలంగా హైదరాబాద్ నగరం ఎంత సుందరంగా, ఆహ్లాదకరంగా ఉందో చెబుతూ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ట్వీట్టర్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు.
అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ది గురించి రోజూ వింటున్నాం, చూస్తున్నాం. అయితే హరిత హారం వల్ల హైదరాబాద్ నగరం ఎంత సుందరంగా తయారయ్యిందో...అందులోనూ వర్షాలు పడుతుండటంతో ఖాళీ ప్రదేశాల్లో పచ్చిక మొలకెత్తి ఎంత అందంగా కనపడుతుందో ఓ ఐఏఎస్ అధికారి ట్విట్టర్ లో ఫోటోలు పోస్ట్ చేశారు. అవి చూస్తూ ఉంటే నిజంగానే అవి యూరప్ లోని ఫోటోలా అనే భ్రాంతి కలగడం సహజం.
తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ బుధవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉందో చూపుతున్న ఆ ఇమేజ్ లు ఆహ్లాదం కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు(ORR) వెంట ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఓఆర్ఆర్ పొడవునా... ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. వెరసి సినిమాల్లో చూపించే సుందర దృశ్యాలకు ఏమాత్రం తీసిపోనిదిగా ఓఆర్ఆర్ కనిపిస్తోంది.
ఓఆర్ఆర్ మీద వేర్వేరు ప్రాంతాల్లో తీసిన తాజా ఫొటోలను పోస్ట్ చేసిన అరవింద్ కుమార్ ఓఆర్ఆర్ ఇలా అత్యంత సుందరంగా, ఆహ్లాదకరంగా మారిపోవడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌ల కృషే కారణమని ఆయన చెప్పుకొచ్చారు.