కాంగ్రెస్ లో మూడో లిస్ట్ మంటలు..
కాంగ్రెస్‌లో టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తున్నారంటూ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు.
తొలి రెండు లిస్ట్ లు విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. గాంధీ భవన్ వద్ద నిరసనలు హోరెత్తాయి. గాంధీ భవన్ కి తాళాలు పడ్డాయి. కొందరు నేతల ఫ్లెక్సీలు చించేశారు, అద్దాలు పగలగొట్టారు. అయితే మూడో లిస్ట్ ఏకంగా మంటలకే కారణం అయింది. థర్డ్ లిస్ట్ బయటకొచ్చిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ లో అగ్గిరాజుకుంది. పటాన్ చెరు పరిధిలో కాంగ్రెస్ బ్యానర్లు, పోస్టర్లు హోర్డింగ్ లు అన్నీ కాలి బూడిదయ్యాయి.
ఆగ్రహ జ్వాలలు..
కాంగ్రెస్‌లో టికెట్ల కెటాయింపు చిచ్చు కొనసాగుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తమని కాదని బయటి నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయిస్తున్నారంటూ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో మూడో జాబితా అగ్గి రాజేసింది. ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధు ఇక్కడ టికెట్ పట్టేశారు. దీంతో చాన్నాళ్లుగా ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పార్టీ బ్యానర్లకు ఆయన అనుచరులు మంటపెట్టారు.
తొమ్మిదేళ్లుగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్న తనను కాదని, మధుకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు కాటా శ్రీనివాస్ గౌడ్. 2018 ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినా కూడా 80 వేల ఓట్లు తెచ్చుకున్నానని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా రాజకీయ ప్రలోభాలకు లోనై కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు శ్రీనివాస్ గౌడ్ అనుచరులు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు తగలబెట్టారు.
♦