దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. సీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు
రాత్రి 2 గంటల వరకూ స్పృహ తప్పేలా మహిళను చావగొట్టారు. ఆమె కుమారుడిని సైతం పోలీసులు చితకబాదారు. విషయం మీడియాలో వచ్చి పెద్దఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆలస్యంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో షాద్‌నగర్ సీఐ రామిరెడ్డితో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఉద్దేశపూర్వక హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. తమకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేయగా అదేరోజు కేసు నమోదైంది. ఇప్పటికే ఈ ఘటనలో సీఐ రామిరెడ్డితో పాటు నలుగురు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
జూలై 30న షాద్‌నగర్ సీఐ రామిరెడ్డి, నలుగురు పోలీసులు.. దళిత మహిళ, ఆమె భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లారు. నాగేందర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి సంబంధించి విచారించేందుకని తీసుకెళ్లిన పోలీసులు తొలుత ఆమె భర్తను కొట్టారు. ఆ తర్వాత దళిత మహిళ దుస్తులు తొలగించి భర్త నిక్కరు తొడిగి లాఠీతో దాడి చేశారు. ఇద్దరు పోలీసులు తొడభాగంపై కాళ్లతో తొక్కుతుండగా, ఛాతీభాగంలో రబ్బరుతో కొట్టారు. ఎవరికైనా చెబితే పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరించారు. రాత్రి 2 గంటల వరకూ స్పృహ తప్పేలా మహిళను చావగొట్టారు. ఆమె కుమారుడిని సైతం పోలీసులు చితకబాదారు. విషయం మీడియాలో వచ్చి పెద్దఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆలస్యంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సైతం పిటిషన్ దాఖలైంది. సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను కఠినంగా శిక్షంచాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.