జూపార్క్‌లో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా?

బహదూర్‌పురలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ 360 ఎకరాల విస్తీర్ణంలో వందలాది జంతుజాలాలకు నిలయంగా ఉన్నది.

Advertisement
Update:2023-07-23 12:07 IST

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో దొంగలు పడ్డారు. నిత్యం కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే ఈ జూపార్కులో దొంగలు పడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. జూపార్కులో పులులు, సింహాలు, ఏనుగులు, ఇతర జంతువులు తప్ప ఏముంటాయి? ఇంతకు దొంగలు పడి ఏమి ఎత్తుకెళ్లారని అనుకుంటున్నారా? జూపార్కులోకి ప్రవేశించిన దొంగలు జంతువులు, పక్షులను ముట్టుకోలేదు. కానీ విలువైన గంధపు చెట్లను నరికి.. గుట్టు చప్పుడు కాకుండా బయటకు తరలించారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది.

బహదూర్‌పురలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ 360 ఎకరాల విస్తీర్ణంలో వందలాది జంతుజాలాలకు నిలయంగా ఉన్నది. ఇక్కడ విలువైన వృక్ష సంపద కూడా ఉంది. అయితే గంధపు చెట్లపై కన్నేసిన కొంత మంది దుండగులు.. గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికేశారు. జూపార్క్ విశాలంగా ఉండటం.. లోపల భద్రత సిబ్బంది తక్కువగా ఉండటం స్మగ్లర్లకు కలిసి వచ్చింది. జూపార్కులోని మొత్తం 7 చెట్లను నరికి.. చిన్న దుంగలుగా మార్చి బయటకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.

జూపార్కులోని విలువైన చెట్లను నరికిన తీరు చూస్తే.. ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారంగా అధికారులు తేల్చారు. ఈ విషయం ఈ నెల 20నే బయటపడింది. అయితే, పార్కులో కొన్ని దుంగలను అక్కడే వదిలేశారు. వీటి కోసం ఎవరైనా వస్తారేమో అని అధికారులు నిఘా పెట్టారు. మూడు రోజులైనా దొంగలు అటువైపు రాలేదు. దీంతో జూపార్క్ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నిఘా పెట్టిన విషయం తెలిసే అక్కడకు రాలేదని జూపార్క్ అధికారులు అంచనాకు వచ్చారు. ఇది కచ్చితంగా ఇంటి దొంగల పనే అని అనుమానిస్తున్నారు.

జూపార్కులో సీసీ కెమేరాలు ఉన్నాయి. అయినా సరే వాటికి దొరకకుండా స్మగ్లర్లు దుంగలను బయటకు తరలించడంపై కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జూపార్కు గురించి, సీసీ కెమేరాల లొకేషన్ గురించి పూర్తిగా అవగాహన ఉన్న సిబ్బందే ఈ పని చేసి ఉంటారని అధికారులు అనుమానానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News