నన్ను నేరస్తుడు అంటుంటే ప్రజలు మౌనంగా ఉండటం బాధనిపిస్తంది

హరీశ్‌, కేటీఆర్‌, ఈటల మూడు నెల్లు అక్కడ నివసిస్తే మూసీ ప్రాజెక్టు బంద్‌ పెడుత : సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-10-17 17:53 IST

మూసీ పేరుతో కొందరు నన్ను నేరస్తుడు అంటుంటే ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటున్నారాని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. వాళ్ల ఆరోపణలకన్నా ప్రజల మౌనమే ఎక్కువగా బాధ పెడుతుందని అన్నారు. గురువారం సెక్రటేరియట్‌ లో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదని, అసలు ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతాయని ఎవరు చెప్పారో కూడా అర్థం కావడం లేదన్నారు. ''ఇదేమన్న కాళేశ్వరమా? రూ.1.50 లక్షల కోట్లు అవడానికి.. ప్రపంచంలోనే అద్భుతాలు నిర్మించిన ఐదు కంపెనీలను ఒక కన్సార్షియం చేసి.. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నాం.. డీపీఆర్‌ తయారు చేయమని చెప్పిన.. అందుకు ఎంత ఖర్చవుతుందో లెక్కకట్టమని చెప్పిన.. ఆ నిధులు ఎట్లా తీసుకురావాలో సూచించాలని కోరిన.. వాళ్లు ఆరున్నర సంవత్సరాలు పని చేయాలని సూచించాం.. మొదటి 18 నెలలు కంప్లీట్‌ స్టడీ చేస్తరు.. ఐదు కంపెనీలకు కలిపి రూ.141 కోట్లతో టెండర్‌ ఇచ్చినం.. వాళ్లు రిపోర్ట్‌ ఇస్తారు.. ఆ తర్వాత నాలుగున్నర నెలలు మూసీని పునరుజ్జీవింపజేస్తాం.. పంటలపై పడ్డ అడవి పందులకు కరెంట్‌ పెట్టి చంపుతలేరా.. నగరంపై అచ్చొసిన అంభోతుల్లా మాట్లాడుతుంటే వాళ్లను బహిష్కరించాల్సిన బాధ్యత మీడియాకు లేదా..'' అన్నారు.

హరీశ్‌ రావు, కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ మూడు నెలలు మూసీ పక్కనే ఉంటే తాను మూసీ ప్రాజెక్టు బంద్‌ పెడతానని అన్నారు. ''ఆ ముగ్గురికి అక్కడ ఖాళీ చేసిన ఇండ్లు కేటాయించమని అధికారులకు ఆదేశిస్తా.. భోజనం కూడా పెడుతాం.. వాళ్లు అక్కడే ఉండి ఎప్పుడు బుల్డోజర్‌ వస్తదా.. అడ్డం పడుకుందామని చూస్తూ ఉండండి..'' అని సవాల్‌ చేశారు. మూసీ రివర్‌ బెడ్‌, ఎఫ్‌టీఎల్‌ లో నివసిస్తున్న వారిని అక్కడి నుంచి తరలించి వారికి మంచి జీవితాన్ని ఇద్దామని తాను అనుకుంటున్నానని.. అది తప్పా అని ప్రశ్నించారు. మూసీని అలాగే వదిలేస్తే హైదరాబాద్‌ లేకుండా పోతుందని హెచ్చరించారు. ''బుల్డోజర్లు మా మీద నుంచి పోవాలని కొందరు పోటీలు పడుతున్నరు.. వాళ్లు ఏమనుకుంటున్నరో.. ఈ నగరాన్ని ఇట్లనే వదిలేద్దమా? చెరువులు, కుంటలు, నాలాలు పోయినయ్‌.. మూసీ మూసుకుపోయిన తర్వాత ఎటు పోదాం.. నగరాన్ని సమాధి చేయదల్చుకున్నరా.. వర్షం పడితే బెంగళూరు, చెన్నై ఏమయింది.. ఖమ్మం, విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కండ్ల ముందు ఉన్నాయి.. మేం ఐదేండ్లు, పదేండ్లు ఉంటమా అనేది ప్రజలు నిర్ణయిస్తరు.. ఒక ఉప్పెన వస్తే నగరమే ఉండదు.. ఆదాయం పెంచాలి.. పేదలకు పెంచాలనే ఆలోచన తప్ప ఈ ప్రాజెక్టు వస్తే నాకు ఏం వస్తది..'' అన్నారు. చిన్న వయసులోనే తనకు ఆస్తి, అంతస్తు, హోదా అన్ని ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన అవకాశంతో పేదలకు మంచి చేయాలని చూస్తున్నానని తెలిపారు.

మూసీ విషం హైదరాబాద్‌ నే కాకుండా నల్గొండను కూడా మింగేస్తుందని తెలిపారు. నల్గొండ నో మెన్స్‌ ల్యాండ్‌ అవుతుందని డబ్ల్యూహెచ్‌వో రిపోర్ట్‌ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. మూసీకి సెక్యూరిటీ లేకుండా వస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారని.. సెక్యూరిటీ లేకుండా కేసీఆర్‌ నియోజకవర్గానికి వస్తా.. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ నిర్వాసిత ప్రజలతో రచ్చబండ మీద కూర్చొని చర్చిద్దామని సవాల్‌ చేశారు. యూట్యూబ్‌ లు పెట్టి సోషల్‌ మీడియాలో తమ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నరని అన్నారు. మూసీ సుందరీకరణ కాదని పునరుజ్జీవం ప్రాజెక్టు మాత్రమేనని తెలిపారు. తనను నమ్మే వారిలో కూడా అనుమానాలు వచ్చేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని, అందుకే అందరి సందేహాలు నివృత్తి చేసేందుకు మీడియా ముందుకు వచ్చానని అన్నారు. ''మధ్యలో నుంచి నది ప్రవహించే నగరం దేశంలోనే లేదు.. ప్రపంచంలోని కొన్ని నగరాల్లో మాత్రమే అలా ఉంది.. అలాంటి అద్భుతమైన మూసీని రక్షించుకొని హైదరాబాద్‌ ను కాపాడుకుందామనే మా ప్రయత్నం.. మేం దుబయికి వెళ్లి మూసీ బ్యూటిఫికేషన్‌ పై మాట్లాడలేదు.. 300 కి.మీ.ల మూసీ నది మత సామరస్యానికి ప్రతీక.. ప్రపంచంతోనే పోటీ పడేలా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దాం.. మూసీని ఇలాగే వదిలేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం.. అందుకే మా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చింది..'' అని తెలిపారు. మూసీ పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలను 33 బృందాలు సర్వే చేసి ప్రతి ఒక్కరి వివరాలు సేకరించారని తెలిపారు. తమ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుపై పది నెలలు నిద్రలేని రాత్రులు గడిపిందన్నారు. మూసీ ప్రాజెక్టుకు పాకిస్థాన్‌ తో లింక్‌ పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

మూసీలోని గుడిసెలపైకి బుల్డోజర్లు, హైడ్రా ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ''హైడ్రా ఏమన్న బూతమా? ఫాం హౌస్‌ ల పండుకున్న దొరనా'' అని ప్రశ్నించారు. ''మూసీ బాధితుల మనసు ఎలా చూరగొనాల అని ఆలోచిస్తున్నాం.. ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సంప్రదింపులు జరపాలని ఇన్‌చార్జీ మంత్రులకు సూచించాను.. డిప్యూటీ సీఎంకు ఆదేశాలు ఇచ్చిన.. అందరితో మాట్లాడి ప్రపోజల్‌ తీసుకొని రావాలని చెప్పిన.. పేదలు మూసీలో ఇండ్లు సంతోషంగా వదిలేసి భార్యాపిల్లలతో డబుల్‌ బెడ్రూం ఇండ్లకు పోయి దసరా పండుగ చేసుకున్నరు.. వాళ్లు ఎప్పటికీ మూసీ కంపులోనే ఉండాల్నా..'' అని ప్రశ్నించారు. వికారాబాద్‌ లో నిర్మించనున్న రాడార్‌ సెంటర్‌ తో ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. తమిళనాడులోని వీఎల్‌ఎఫ్‌ సెంటర్‌ ఆవరణలో ఇండియన్‌ నేవిలోని ఉన్నతాధికారులు జీవిస్తున్నారని తెలిపారు. ''సెల్‌ ఫోన్‌ల టవర్లతో ప్రమాదం అన్నరు.. అదే నిజమైతే మనమందరం ఎప్పుడో సచ్చిపోవాలే.. సెల్‌ ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ కన్నా తక్కువ ప్రమాదం రాడార్‌ సెంటర్‌ తో ఉంటుంది.. అడవుల్లో లక్షలాది చెట్లను కూల్చేస్తారనడం తప్పుడు ప్రచారమే.. అడివిలో ఖాళీజాగా ఉన్న ఎనిమిది నుంచి తొమ్మిది శాతమే కన్‌స్ట్రక్షన్‌ ఏరియా ఉంటది.. రాడార్‌ సెంటర్‌ ను అడ్డుకోవాలని చూసేటోళ్లు కసబ్‌ లాంటోళ్లు.. వాళ్లే జీవోలు ఇచ్చిండ్రు.. నేను కంటిన్యూ చేసిన.. దేశ భద్రత విషయంలో రాజీ పడొద్దనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పినం.. బతుకమ్మ చీరలు ఆపితే వాళ్లకు వచ్చే రూ.500 కోట్లు పోతున్నయని గగ్గోలు పెడుతున్నరు.. రాడార్‌ సెంటర్‌ ను అడ్డుకోవాలనుకుంటే కేటీఆర్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌ కారుకు అడ్డం పండుకోనుండే.. నిరసన తెలుపతానంటే పోలీసులు ఏమైనా హౌస్‌ అరెస్ట్‌ చేసిండ్రా..'' అని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News