దాడిపై నోరు మెదపలేదు.. అరెస్టులను ఎలా ఖండిస్తారు

లగచర్ల దాడిపై సమగ్ర విచారణ జరపాలి.. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

Advertisement
Update:2024-11-12 18:19 IST

అధికారులపై దాడి చేస్తే నోరు మెదపని వాళ్లు.. దాడి చేసిన వాళ్లను అరెస్టు చేస్తే ఖండించడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి. లచ్చిరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సెక్రటేరియట్‌ మీడియా సెంటర్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేసే ఉద్యోగులపై దాడులు చేయడం మంచిది కాదన్నారు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో ఉద్యోగులపై దాడి ఘటనను సమగ్ర విచారణ జరపాలని కోరుతూ డీజీపీ జితేందర్‌ కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, కడా స్పెషల్‌ ఆఫీసర్‌, తహశీల్దార్‌, ఇతర అధికారులపై కొందరు రైతుల ముసుగులో పథకం ప్రకారం దాడి చేసినట్టుగా అనిపిస్తుందన్నారు. దాడి చేసిన వారి వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు తమ అభిప్రాయం స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఉందని, కానీ కలెక్టర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించడం, దాడికి దిగడం, వాహనాలను ధ్వంసం చేయడం పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయ‌కులు రామ‌కృష్ణ‌, రాములు, ర‌మేశ్‌, ఫూల్‌సింగ్ చౌహాన్‌, రాధ‌, తెలంగాణ నిర్మ‌ల‌, చంద్ర‌శేఖ‌ర్‌గౌడ్‌, రాబ‌ర్ట్ బ్రూస్‌, పుష్ప‌ల‌త‌, తిరుప‌తి, విజ‌య్‌కుమార్‌, హ‌రీంద‌ర్‌సింగ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. లగచర్లలో దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్‌, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌, టీచర్స్‌, వర్కర్స్‌, పెన్షనర్స్‌ జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాస్‌ రావు మంగళవారం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.




 


Tags:    
Advertisement

Similar News