కుంభకోణాలపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ కుట్రలు
మేము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే చావుకు తెగించి వచ్చినోల్లం.. ఈ కేసులకు.. చిల్లర ప్రయత్నాలకు బయపడేటోళ్లం కాదన్న కేటీఆర్
మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబం, బంధువుల మీద అక్రమ కేసులు బనాయించి, కుట్రలు చేసి మా మానసిక స్థైర్యం దెబ్బ తీయాలని చూస్తున్నది రేవంత్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలేక తమ బంధువులపై కేసులు పెడుతున్నారు. కుట్రలతో తమ గొంతు నొక్కలేరన్నారు. మూసీ కుంభకోణం, వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కాములను బీఆర్‌ఎస్ బైటపెడుతున్నది. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కుట్రలకు తెరలేపారు. మా ధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక.. మా కుటుంబసభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నారు. కుట్రలు చేసి మా గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
మేము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే చావుకు తెగించి వచ్చినోల్లం.. ఈ కేసులకు.. చిల్లర ప్రయత్నాలకు బయపడేటోళ్లం కాదు.మీ వెంటపడుతాం.. కాంగ్రెస్ వైఫల్యాలపై ఖచ్చితంగా చీల్చి చెండాడుతూనే ఉంటాం. చేతిలో అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదు. సుమారు 22 గంటలుగా మా బంధువుల ఇళ్లలో ప్రహసనంలా సోదాల కార్యక్రమం కొనసాగిస్తున్నారు. నా బావమరిది రాజ్ పాకాల ఉంటున్న సొంత ఇంట్లో దీపావళి పండుగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్న వారికి చెబుతున్నా, అది ఫార్మ్ హౌస్ కాదు, నా బావమరిది కొత్తగా కట్టుకున్న ఇల్లు. దసరా, దీపావళి సందర్భంగా ఫ్యామిలీ ఫంక్షన్ కోసం కుటుంబ సభ్యులను పిలిచాడు. మా అత్తమ్మ (70), చిన్నపిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఒక కుటుంబం కలిసి ఉంటే, దాన్ని రేవ్ పార్టీ అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. పార్టీలో అసలు డ్రగ్స్ దొరకలేదు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకున్నాడో తెలియదు. చేతనైతే రాజకీయంగా తలపడండి. ఇచ్చిన హామీలపై దృష్టి సారించండి అని కేటీఆర్ అన్నారు.