కౌలురైతులు, కూలీల ఆత్మహత్యల్లేని తెలంగాణ.. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్‌లో వెల్లడి
రైతుబంధులాంటి వ్యవసాయ సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడటంతో తెలంగాణలో కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరిగింది.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. సాగు విస్తీర్ణం, పంట దిగుబడులు పెరగడమే కాదు.. రైతు ఆత్మహత్యలు 41 శాతం తగ్గడం దీనికి ప్రబల సాక్ష్యం. కేంద్ర హోం శాఖ విడుదల చేసిన నేరగణాంక నివేదిక - 2022 ఈ విషయాన్ని వెల్లడించింది.
వాళ్ల బలవన్మరణాలు ఒక్కటీ లేవు..
2021లో తెలంగాణలో రైతులు 303 మంది, కౌలు రైతులు 49 మంది, వ్యవసాయ కూలీలు ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య సగానికి తగ్గింది. 178 మంది వ్యవసాయదారులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఇందులో కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఒక్కరూ లేకపోవడం విశేషం.
సంక్షేమ పథకాల వల్లే..
రైతుబంధులాంటి వ్యవసాయ సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడటంతో తెలంగాణలో కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. దీనికితోడు దిగుబడులూ బాగుండటంతో రైతులు నష్టాల నుంచి బయటపడుతున్నారు. ఫలితంగా రైతుల అప్పులు తగ్గి, ఆత్మహత్యల పరిస్థితి క్రమంగా తగ్గుముఖం పడుతోందని వ్యవసాయ, ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.