రాజగోపాల్ రెడ్డిని ఊళ్ళోకి అడుగుపెట్టకుండా వెళ్ళగొట్టిన గ్రామస్తులు

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డిని ఓ గ్రామంలో జనం తీవ్రంగా అవమానించారు. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు పర్చకుండా మళ్ళీ గ్రామంలోకి ఎందుకొచ్చావంటూ ఆయనను ఊళ్ళోనుండి వెళ్ళగొట్టారు.

Advertisement
Update:2022-09-11 11:24 IST

మునుగోడు ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో కలియతిరుగుతున్నాడు. నిన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ లో పని చేసిన కార్యకర్తలను బీజేపీలో చేర్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నికల డేట్ ఇంకా ప్రకటించక ముందే డబ్బులను మంచి నీళ్ళలా ఖర్చుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ గ్రామంలో ఆయనకు అవమానకర సంఘటన ఎదురయ్యింది.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని సర్వేల్‌ గ్రామపంచాయతీ పరిధి మర్రిగూడెంలో గణేశ్‌ విగ్రహం వద్ద శుక్రవారం రాత్రి అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడానికి రాజగోపాల్‌రెడ్డి వెళ్లారు. ఆ సమయంలో ఆ గ్రామ ప్రజలు ఆయాను అడ్డుకున్నారు. గత ఎన్నికలప్పుడు స్వంత నిధులతో గ్రామానికి సీసీ రోడ్లు నిర్మిస్తానని, వాటర్ ప్లాంట్ నిర్మిస్తానని హామీ ఇచ్చి గెలిచాక ఇటువైపు కూడా తొంగి చూడలేదంటూ జనం మండిపడ్డారు. ఎమ్మెల్యే అయ్యాక తమ గ్రామానికి ఎందుకు రాలేదని, ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని రాజగోపాల రెడ్డిని నిలదీశారు. ఆయన సర్ది చెప్పడానికి ప్రయత్నించినా పెద్ద ఎత్తున మహిళలు ఆయనను అడ్డుకున్నారు. వారికి జవాబు చెప్పలేక రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నా ఆగని మహిళలు మళ్ళీ ఊర్లోకి అడుగుపెడితే మర్యాద దక్కదు అని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News