ముహూర్తం బాగుంది.. నేడు బీఆర్ఎస్ తొలి జాబితా ప్రకటించనున్న సీఎం కేసీఆర్!

సోమవారం పంచమి తిథి కావడంతో అభ్యర్థుల జాబితా ప్రకటనకు మంచి ముహూర్తం దొరికింది. కేసీఆర్ తప్పకుండా సోమవారం అభ్యర్థులను ప్రకటిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement
Update:2023-08-21 07:54 IST

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు మూహూర్తాల పట్ల చాలా నమ్మకం. తిథులు, నక్షత్రాలు చూసే ఏ మంచి పనిని అయనా మొదలు పెడతారు. కాగా, కొన్ని రోజులుగా అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం ఉత్కంఠ నెలకొన్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జాబితాను సీఎం కేసీఆర్ నేడో, రేపో ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతూ ఉన్నది. ప్రతిపక్ష పార్టీల కంటే ముందుగానే జాబితాను విడుదల చేసి.. ఎన్నికల ప్రచారంలో దూసుకొని పోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు 21) మంచి ముహూర్తం ఉండటంతో.. ఇవ్వాల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శాసన సభకు నవంబర్-డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా ప్రకటించిన అనంతరం ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో సోమవారం పంచమి తిథి కావడంతో అభ్యర్థుల జాబితా ప్రకటనకు మంచి ముహూర్తం దొరికింది. కేసీఆర్ తప్పకుండా సోమవారం అభ్యర్థులను ప్రకటిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆదివారం సూర్యాపేట జిల్లా పర్యటనకు వెళ్లడానికి ముందు మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డితో కేసీఆర్ భేటీ అయ్యారు. తిరిగి వచ్చిన తర్వాత మరి కొంత మంది మంత్రులతో రాత్రంతా చర్చలు జరిపారు. ఇప్పటికే కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు టికెట్ల విషయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి మాట్లాడినట్లు తెలుస్తున్నది. ఈ పరిణామాలు అన్నీ గమనిస్తే సోమవారం తప్పకుండా తొలి జాబితా ప్రకటన ఉంటుందని తెలుస్తున్నది.

సోమవారం ఉదయం 11 గంటల తర్వాత ఎప్పుడైనా కేసీఆర్ ఈ జాబితాను విడుదల చేస్తారని తెలుస్తున్నది. గత ఎన్నికల సమయంలో ఓకే సారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ సారి దాదాపు 90 మందిని తొలి జాబితాలో ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎంత మందికి టికెట్లు వస్తాయనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది.

ఇప్పటికే సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పలు దఫాలుగా సర్వేలు, సామాజిక సమీకరణలు, అభ్యర్థుల బలాబలాలు, ప్రత్యర్థుల బలాలను పరిగణలోకి తీసుకున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలు కూడా సేకరించినట్లు తెలుస్తున్నది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే తుది జాబితాను సిద్ధం చేశారని సమాచారం. టికెట్లు ఖరారైన వెంటనే.. అభ్యర్థులతో పాటు, ఆశావహులు కూడా ఇక టికెట్ల పైరవీలు మానేసి ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా చేసి.. ప్రచారాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు.

సిట్టింగు ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ భరోసా పెట్టినట్లు తెలుస్తున్నది. ఈ సారి కూడా సింహభాగం టికెట్లు వారికే దక్కనున్నాయి. సమస్యలు ఉన్న నియోజకవర్గాల్లో తప్పించి.. ఎక్కడా పెద్దగా మార్పులు చేయలేదనే అంచనాలు ఉన్నాయి. ఎక్కడైనా మార్పు జరిగితే.. ఆ స్థానంలోని అసంతృప్తులకు భవిష్యత్‌లో తగిన అవకాశాలు ఇస్తామనే భరోసా కూడా సీఎం కేసీఆర్ ఇవ్వనున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ అభ్యర్థులు తొలి జాబితా కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News