టికెట్లు సరే.. అసంతృప్తులను ఏం చేద్దాం?

బీసీలకు భారీగా టికెట్లు ఇవ్వాలని ఆ వర్గం నాయకులు ఇప్పటికే బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Update:2023-09-27 08:04 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన టికెట్ల కసరత్తు కాంగ్రెస్‌లో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. టికెట్లు ప్రకటిస్తే అసంతృప్తులను ఎలా చల్లార్చాలనే విషయం పైనే ఇప్పుడు అధిష్టానం హైరానా పడుతోంది. తొలి విడత టికెట్ల కేటాయింపు విషయంలో ఇప్పటికే పూర్తి కసరత్తు జరిగినా.. అసంతృప్తుల భయంతోనే ఇంకా వెల్లడించలేదని తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నాయకులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత్వే ఖమ్మం జిల్లాలో నాయకులు టికెట్ కోసం కొట్టుకున్న సంఘటన జరిగింది. ఇప్పుడు కన్ఫార్మ్ అయిన టికెట్లు ప్రకటిస్తే ఎన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయో అని అధిష్టానం ఆందోళన చెందుతున్నది.

బీసీలకు భారీగా టికెట్లు ఇవ్వాలని ఆ వర్గం నాయకులు ఇప్పటికే బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. నలుగురి పేర్లు లిస్టులో లేవనే కారణంతో అల్టిమేటం కూడా జారీ చేశారు. తొలి జాబితాలో బీసీల పేర్లు తగ్గితే.. ఆ వర్గం నాయకుల తప్పకుండా ఆందోళన చేస్తారని అధిష్టానం అంచనా వేస్తోంది. మరో వారం రోజుల్లో టికెట్లు ప్రకటించే అవకాశం ఉండటంతో. ముందుగా అసంతృప్తులను చల్లార్చాలని నిర్ణయించింది. టికెట్ దక్కని నాయకులను పిలిచి బుజ్జగించాలని భావిస్తోంది. అవసరం అయితే జాతీయ స్థాయి నాయకులను వాళ్ల ఇళ్లకు పంపి.. ముందస్తు హామీలు ఇవ్వాలని అనుకుంటున్నది.

ఆయా నియోజకవర్గంలో టికెట్లు ఆశించినా.. ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని తెలియజేసి.. బుజ్జగించాలని నిర్ణయించింది. అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తామనే హామీలు కూడా ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాలు చెప్పాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 8 నియోజకవర్గాల్లో ఉన్న కీలకమైన నేతలకు టికెట్లు దక్కే అవకాశం లేదు. నాగర్‌కర్నూల్, సూర్యాపేట, జనగామ, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో బలమైన నాయకుల మధ్య పోటీ ఉన్నది. ఇక్కడ ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నది. ఆయా నాయకులతో జాతీయ నాయకులే మాట్లాడి.. స్పష్టమైన హామీ ఇస్తారని తెలుస్తున్నది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి జాబితా విడుదల చేయడానికి ముందే ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి.. భంగపాటుకు గురయ్యే నాయకులకు ఈ రోజు నుంచే బుజ్జగింపులు ప్రారంభమవుతాయని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో సయోధ్య కుదిర్చిన తర్వాతే టికెట్లు ప్రకటిస్తారని తెలుస్తున్నది.


Tags:    
Advertisement

Similar News