బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి షాక్.. ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నికను రద్దు చేయడంతో పాటు రూ. 50 వేల జరిమానా కూడా విధించింది. రెండేళ్ల పదవీకాలం కూడా పూర్తి కాకుండా ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు షాకిచ్చింది తెలంగాణ హైకోర్టు. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెల్లడించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
2022లో జరిగిన ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విఠల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా.. పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా, తాను నామినేషన్ విత్ డ్రా చేయకుండానే.. ఉపసంహరించుకున్నట్లుగా ఫోర్జరీ సంతకాలతో విఠల్ తప్పుడు పత్రాలు ఇచ్చారనేది రాజేశ్వర్ రెడ్డి ఆరోపణ. దీనిపైనే రాజేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఫోర్జరీని తేల్చేందుకు విత్ డ్రా పేపర్స్‌ను కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబోరేటరికి పంపించాలని కోరారు. దీనిపై విచారణ జరిపి ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తాజాగా తీర్పు వెల్లడించింది.
ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నికను రద్దు చేయడంతో పాటు రూ. 50 వేల జరిమానా కూడా విధించింది. రెండేళ్ల పదవీకాలం కూడా పూర్తి కాకుండా ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. ఐతే ఈ తీర్పుపై విఠల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.