రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యలే

ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్‌ కార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం బీఆర్‌ఎస్‌ విజయం అన్న హరీశ్‌రావు

Advertisement
Update:2025-01-20 10:52 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదిలాబాద్‌ జిల్లా బ్యాంక్‌ రుణ భారంతో మరో రైతు రాథోడ్‌ గోకుల్‌ మృతి చెందాడని హరీశ్‌ ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్‌ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. రుణమాఫీ పూర్తిగా చేశామన్న రేవంత్‌రెడ్డి బ్యాంకు అధికారుల వేధింపులతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్‌ కార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడం బీఆర్‌ఎస్‌ విజయం అని హరీశ్‌రావు తెలిపారు. మీ -సేవా దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పల్లెలు, పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని, 20 రోజుల పని దినాల నిబంధన తొలిగించాలని కోరారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై హరీశ్‌రావు మండిపడ్డారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల డిమాండ్లను పరిష్కరించి బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదన్న విషయం, కాంగ్రెస్ పాలకులు పూర్తిగా మరిచిపోయినట్లున్నారు.రైతు సోదరులారా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి.ఆత్మహత్యలు పరిష్కారం కాదు. బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది.కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా అందరికీ రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పంటలకు 500 బోనస్ హామీలు అమలు చేసే దాకా నిలదీస్తూనే ఉంటామని హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News