తెలంగాణలో తెలుగుదేశం కథ ముగిసినట్టేనా..?

తెలంగాణలో పోటీ చేయడం లేదన్న వార్తాలతో ప్రస్తుత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సైతం కారెక్కెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీ-టీడీపీలో కాసాని మినహా పేరు మోసిన పెద్ద నేతలు ఎవరూ లేరు.

Advertisement
Update:2023-10-27 13:22 IST

తెలంగాణలో తెలుగుదేశం కథ ముగిసినట్టేనా..?

తెలంగాణలో తెలుగుదేశం కథ ముగిసినట్లేనా..! అంటే అవుననే సమాధానమే బలంగా వినిపిస్తోంది. రెండు, మూడు రోజుల క్రితం వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 87 స్థానాల్లో పోటీ చేస్తుందని..పొత్తులో భాగంగా జనసేన మరో 32 స్థానాల్లో పోటీలో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా తెలంగాణలో పోటీ చేసేందుకు ఆ పార్టీ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేరిట లేఖ విడుదలైందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం కథ సమాప్తం అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలంగాణ కంచుకోటలా ఉండేది. పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో కనీసం పోటీ చేయలేని స్థితికి దిగజారడం ఇదే ఫస్ట్ టైం. 2014లో టీడీపీ తరపున 15 మంది శాసనసభ్యులు గెలవగా..వారంతా గులాబీ పార్టీకి జంప్‌ అయ్యారు. తర్వాత 2018లో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం..కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. ఆ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. తర్వాత ఆ ఇద్దరు సైతం కారెక్కడంతో తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది.

తర్వాత క్రమంగా తెలంగాణలో టీడీపీ ప్రభ మసకబారింది. ఇక మిగిలిన సీనియర్ నేతలు సైతం ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ పార్టీలో ఒకప్పుడు వెలుగువెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి, దేవెందర్ గౌడ్‌ లాంటి నేతలు ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గతేడాది క్రితం వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్‌.రమణ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేతగా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి సైతం కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది.

ఇక ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయడం లేదన్న వార్తాలతో ప్రస్తుత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సైతం కారెక్కెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీ-టీడీపీలో కాసాని మినహా పేరు మోసిన పెద్ద నేతలు ఎవరూ లేరు. ఇక ప్రస్తుతం ఏపీలోనూ తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులెదుర్కొవడం, అధినేత చంద్రబాబు జైలులో ఉండడం, ఆయనకు వయసు పైబడుతుండడంతో...కేవలం ఏపీకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం అనే మాట వినపడకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    
Advertisement

Similar News