టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు

సోమవారం కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డిని సిట్ కార్యాలయంలో విచారించారు. దాదాపు మూడున్నర గంటల పాటు సిట్ అధికారులు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.

Advertisement
Update:2023-04-04 07:36 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రధాన నిందితులు, పరీక్ష రాసి 100 మార్కులకు పైగా తెచ్చుకున్న అభ్యర్థులను విచారించిన సిట్ అధికారులు.. ఇక ఇప్పుడు ఉన్నతాధికారులను విచారిస్తున్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆమె వద్ద నుంచి కొంత సమాచారాన్ని రాబట్టారు. ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రూమ్ వివరాలను గురించి కూడా అడిగారు. అయితే తనకు యాక్సెస్ ఉండదని ఆమె చెప్పారు. ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్స్ అన్నీ చైర్మన్ ఆధీనంలోనే ఉంటాయని అనితా రామచంద్రన్ స్పష్టం చేశారు.

కార్యదర్శి అనితా రామచంద్రన్ వెల్లడించిన వివరాల మేరకు.. సోమవారం కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డిని సిట్ కార్యాలయంలో విచారించారు. దాదాపు మూడున్నర గంటల పాటు సిట్ అధికారులు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల తయారీ, భద్రపరచ్చడం, ఎగ్జామ్స్ నిర్వహణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌లో చైర్మన్ పాత్ర ఎంత వరకు ఉంటుందని ప్రశ్నించారు. ఉద్యోగులు టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ రాయాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నిర్వహణ ఎలా ఉంటుంది? వంటి వివరాలు ఆయన వద్ద తీసుకున్నారు.

కార్యదర్శి పీఏ ప్రవీణ్ కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఉంటే మీ దృష్టికి వచ్చాయా అనే విషయాలు తెలుసుకున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండ్ శంకర లక్ష్మి బాధ్యతగా ఉంటారా అని కూడా అడిగినట్లు సమాచారం. గతంలో ఇలాంటి సమస్యలు కార్యాలయంలో అంతర్గతంగా ఏమైనా చర్చించారా అని సిట్ అధికారులు అడిగారు. సుదీర్ఘ విచారణలో చైర్మన్ జనార్థన్ రెడ్డి వివరంగా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధంచి కమిషన్‌లో ఉద్యోగుల నిర్లక్ష్యంపై అంతర్గత విచారణ చేస్తున్నామని జనార్ధన్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది.

క్వశ్చన్ పేపర్లు అమ్మి.. చీటీల వ్యాపారం, కాంట్రాక్టులు..

సిట్ అధికారుల విచారణలో పలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఏఈ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో కేతావత్ రాజేశ్వర్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మూడు ఏఈ పేపర్లను రూ.40 లక్షలకు అమ్ముకున్నట్లు సిట్ గుర్తించింది. వాటిలో రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొని రూ.10 లక్షలు డాక్యా నాయక్‌కు ఇచ్చాడు. అందులో నుంచి రూ.5 లక్షలు పీఏ ప్రవీణ్ కుమార్‌కు చేరినట్లు సమాచారం. ఇక రాజేశ్వర్ పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో సొంతూరులో చీటీల వ్యాపారం చేశాడని.. గ్రామంలో అభివృద్ధి పనుల కాంట్రాక్టులు కూడా చేసినట్లు అధికారులు గుర్తించారు.

కాగా, లీక్ అయిన ఏఈ పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసిన ప్రశాంత్ రెడ్డి, రాజేంద్ర కుమార్‌లను రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్, సోదరుడు రాజేశ్వర్‌కు పరిచయం చేసిన కాంట్రాక్టర్ తిరుపతయ్యను కస్టడీ కోరగా.. మూడు రోజులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇతడి నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంటుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. తిరుపతయ్య గండీడ్ మండలంలో ఉపాధి హామీ పథకం టీఏగా పని చేస్తుండగా.. ప్రస్తుతం అతడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News